Telugu Gateway
Politics

బిజెపికి మేలు చేసిన రాముడు..రాముడికి న్యాయం చేసిన బిజెపి

బిజెపికి మేలు చేసిన రాముడు..రాముడికి న్యాయం చేసిన బిజెపి
X

రాజకీయంగా బిజెపి ఇప్పుడు దేశంలో ఇంత అజేయశక్తిగా నిలిచింది అంటే ఆ పార్టీ అగ్రనేతలతోపాటు ‘రాముడి’ పాత్ర కూడా తక్కువేమీ కాదు. రెండు సీట్లతో ఉన్న బిజెపిని ప్రస్తుత ఈ స్థితికి చేర్చటంతో పాటు రాముడిని బిజెపి సొంతం అనేలా చేయటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి లాల్ కృష్ణ అద్వానీ. ఆయన నిర్వహించిన రథయాత్రతోనే దేశంలో బిజెపికి ఒక ఊపు వచ్చింది. అద్వానీ రథయాత్ర ప్రారంభించే నాటికి దేశంలోని పలు రాష్ట్రాల్లో అసలు బిజెపికి ఉనికే లేదు. అలాంటిది అద్వానీ రథయాత్రతో ముఖ్యంగా ఉత్తరభారత దేశంలో బిజెపికి బలమైన పునాది వేయటంలో అద్వానీ పాత్ర విస్మరించలేనిది. రామజన్మభూమి అయిన అయోధ్యలో రామాలయం నిర్మించాలనే నినాదంతో అద్వానీ 1990లో రథయాత్రకు శ్రీకారం చుట్టారు. దీనికి దేశ వ్యాప్తంగా కోట్లాది మంది కనెక్ట్ అయ్యారు కూడా. బీహార్ లో అద్వానీ అరెస్ట్..పలు రాష్ట్రాల్లో సమస్యలు కూడా ఎదుర్కొన్నారు అప్పట్లో. రాముడు..రామజన్మభూమి వంటి అంశాలు భక్తుల మనోభావాలు..భావోద్వేగాలతో కూడిన అంశాలు అన్న సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి బిజెపి తాము ఎప్పటికైనా అయోధ్యలో రామాలయం కట్టి తీరుతామని ప్రకటిస్తూ వస్తోంది. అంతే కాదు ఆ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా అయోధ్యలో రామాలయ నిర్మాణం అంశాన్ని చేర్చారు కూడా. ఇప్పుడు అత్యంత కీలకమైన..కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ హామీ నెరవేరబోతోంది. అత్యంత కీలకమైన బిజెపి హామీ అయిన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బుధవారం నాడు అట్టహాసంగా భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ కీలక ఘట్టానికి అద్వానీ, మురళీమనోహర్ జోషి వంటి వాళ్లను దూరంగా పెట్టడం మాత్రం పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనికి వాళ్ల వయస్సును కారణంగా చూపిస్తున్నా బుధవారం నాడు అయోధ్యలో జరిగిన కార్యక్రమానికి హాజరైన సాధువుల దగ్గర నుంచి ఇతర అతిధులను చూస్తే వాళ్ల వయస్సు తక్కువేమీ కాదనే విషయం స్పష్టం అవుతోంది. అంతే కాదు..నిజంగా అయోధ్య ట్రస్ట్ కు..ప్రభుత్వ పెద్దలకు అద్వానీ, మురళీమనోహర్ జోషి వంటి వాళ్లను ఆహ్వానించాలనుకుంటే వాళ్ల కోసం ‘ప్రత్యేక ఎన్ క్లోజర్స్’ పెట్టి మరీ పిలిచేవాళ్ళనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

కానీ వీడియో ద్వారా వీక్షించాలని చెప్పి సరిపెట్టుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా టీవీల్లో అయోధ్య భూమి పూజను చూసిన వారికి..అద్వానీ వీడియో లో చూసిన దానికి పెద్ద తేడా ఏముంటుంది?. రామజన్మభూమి ప్రాధాన్యత అంశాన్ని దేశంలో అందరికీ తెలిసేలా చేయటంతోపాటు బిజెపి ఉన్నతికి కారణమైన అద్వానీని ఈ అంశంలో దూరం పెట్టడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు తెరతీసింది. బుధవారం నాడు జరిగిన కార్యక్రమం అంతా నరేంద్రమోడీ ‘వన్ మ్యాన్ షో’లాగానే సాగిపోయింది. అయితే రాజకీయంగా బిజెపికి ఎంతో మేలు చేసిన రాముడికి అయోధ్యలో రామాలయ నిర్మాణం ద్వారా బిజెపి కూడా తన రుణం తీర్చుకుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.

Next Story
Share it