Telugu Gateway
Politics

భారతరత్న ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు

భారతరత్న ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు
X

మాజీ రాష్ట్రప్రతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆర్మీ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూ సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్తను ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు. ఆర్మీ ఆస్పత్రికి చెందిన డాక్టర్లు విశ్వప్రయత్నాలు చేసినా, ఎంతో మంది ప్రార్ధనలు చేసినా అవేమీ ఫలించలేదని పేర్కొన్నారు. భారత 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ 2012 నుంచి 2017 వరకూ సేవలు అందించారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో, కేంద్ర మంత్రిగా వివిధ హోదాల్లో విశేష సేవలు అందించారు. 1935 డిసెంబర్ 11న ఆయన ప్రణబ్ ముఖర్జీ జన్మించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 84 సంవత్సరాలు.అనారోగ్యంతో ఆగస్టు 10న ప్రణబ్ ఆస్పత్రిలో చేరారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆర్మీ ఆస్పత్రి డాక్టర్లు సర్జరీ నిర్వహించారు. ఆ తర్వాత ప్రణబ్ ముఖర్జీ కోవిడ్ 19 నిర్ధారణ అయింది. అప్పటి నుంచి పరిస్థితి సంక్లిష్టంగానే మారింది.

పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుపొందారు. ఎంతటి సంక్లిష్టమైన సమస్యలు అయినా పరిష్కారానికి ఆయనకే అప్పగించేవారు. ప్రణబ్ ముఖర్జీ కొన్ని రోజులు జర్నలిస్ట్ గా కూడా పనిచేశారు. బెంగాలీ పత్రిక దెషర్ దక్ లో బాధ్యతలు నిర్వర్తించారు. 1982లో దేశ ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశంలోనే అత్యంత చిన్న వయస్సులో ఈ బాధ్యత చేపట్టిన వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు. 1998లో సోనియాగాంధీ కాంగ్రెస్ సారధ్య చేపట్టేలా చేయటంలో ప్రణబ్ ముఖర్జీదే కీలక పాత్ర. 2019లో బిజెపి నేతృత్వంలోని మోడీ సర్కారు ఆయనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డును ప్రకటించింది.

Next Story
Share it