Telugu Gateway
Politics

విశ్వాసపరీక్షలో నెగ్గిన అశోక్ గెహ్లాట్ సర్కారు

విశ్వాసపరీక్షలో నెగ్గిన అశోక్ గెహ్లాట్ సర్కారు
X

రాజస్థాన్ లో రాజకీయ అనిశ్చితికి తెరపడింది. గత నెల రోజులుగా సాగిన హైడ్రామాకు తెరపడింది. శుక్రవారం నాడు రాజస్థాన్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో అశోక్ గెహ్లాట్ సర్కారు మూజువాణి ఓటుతో విజయం సాధించింది. గెహ్లాట్ పై అసమ్మతి జెండా ఎగరేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గం అధిష్టానంతో జరిగిన రాజీచర్చల అనంతరం వెనక్కి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో విశ్వాసతీర్మానం సులభంగా నెగ్గిపోయింది. నిజానికి పైలట్ వర్గీయులు లేకపోయినా గెహ్లాట్ సర్కారు సురక్షితంగానే ఉన్నా..అతి తక్కువ మెజారిటీతో నెట్టుకురావాల్సి వచ్చేది.

విశ్వాసపరీక్ష అనంతరం అసెంబ్లీ ఆగస్టు 21కి వాయిదా పడింది. రాజీ కుదిరినా కూడా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ల మధ్య పరోక్షంగా మాటల యుద్ధం సాగుతోంది. అసెంబ్లీలో సచిన్ పైలట్ కు అధికార పార్టీ నేతలకు దూరంగా, ప్రతిపక్ష సభ్యులకు దగ్గరగా సీటు కేటాయించటంపై పైలట్ స్పందించారు. దీనికి కారణం తెలుసా అంటూ ..ధైర్యవంతులు, శక్తివంతులైన సైనికులను మాత్రమే సరిహద్దులకు పంపుతారు అంటూ వ్యాఖ్యానించారు.

Next Story
Share it