Telugu Gateway
Politics

వైసీపీలో ఆనందం..టీడీపీలో నిర్వేదం

వైసీపీలో ఆనందం..టీడీపీలో నిర్వేదం
X

రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్ డీఏ రద్దు బిల్లులకు ఆమోదం తెలపటంతో వైసీపీలో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. పలు జిల్లాల్లో టపాసులు కాల్చి మరీ వైసీపీ నేతలు, కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరూ ఊహించిన రీతిలో శాసనసభ వేదికగా మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కమిటీల ఏర్పాటు..నివేదికల రాక...అసెంబ్లీ ఆమోదం..తాజాగా గవర్నర్ ఆమోదంతో ప్రతిష్టాత్మక ఈ కీలక బిల్లులకు లైన్ క్లియర్ అయింది. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు శంకుస్థాపన చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అమరావతిలో రైతులకు అభివృద్ధి చేసిన ఫ్లాట్స్ అందిస్తామని..అక్కడే లెజిస్లేచర్ రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని వస్తుందని తెలిపారు. మూడు రాజధానులను అడ్డుకునేందుకు చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేస్తే ..వాటి అన్నింటిని అధిగమించామన్నారు.

ఎంతో మంచి రోజు అయిన శ్రావణశుక్రవారం నాడు గవర్నర్ ఈ బిల్లులకు ఆమోదం తెలపటం ఎంతో మంచి జరుగుతుందని తెలిపారు. వైసీపీ నేతలు అందరూ గవర్నర్ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు గవర్నర్ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పలు అంశాలను విస్మరించి గవర్నర్ బిల్లులపై సంతకం చేశారన్నారు. సెలక్ట్ కమిటీ అంశాన్ని ఎలా విస్మరిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు ఈ శుక్రవారం బ్లాక్ డే అని మరో నేత బొండా ఉమా వ్యాఖ్యానించారు. ఈ బిల్లులపై తాము న్యాయపోరాటం చేస్తామన్నారు. అమరావతి రైతులు కూడా గవర్నర్ నిర్ణయం తర్వాత రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు.

Next Story
Share it