Telugu Gateway
Andhra Pradesh

సోనూసూద్ సాయంపై ఏపీ సర్కారులో ఉలికిపాటెందుకు?

సోనూసూద్ సాయంపై ఏపీ సర్కారులో ఉలికిపాటెందుకు?
X

ఏపీ సర్కారు ఎందుకు ఉలికిపాటుకు గురవుతోంది. ఇంత చిన్న విషయంలో అంత పెద్ద హైరానా ఎందుకు?. ఆగమేఘాల మీద సచివాలయంలోని అధికారులు అసలు ఆ రైతు పరిస్థితి ఏంటో కనుక్కోమ్మని స్థానిక అధికారులను ఆదేశించటం ఏంటి? ఏకంగా కె వి పల్లె ఎంపీడీవో ఎస్. మనోహర్ రాజు హిందుకు సదరు రైతు పేదవాడే కాదని..ఏదో సరదగా..స్వచ్చందంగా కావాలనే అలా చేశారని చెప్పటం వెనక కారణాలు ఏంటి? అంతే కాదు..తాము ఏదో సరదాగా చేసిన పని ఇన్ని మలుపులు తిరుగుతుందని తాము ఊహించలేదని స్టేట్ మెంట్ కూడా ఇచ్చారని ప్రకటించటం వెనక కారణాలు ఏమై ఉంటాయి?. నిజంగా ఎంపీడీవో సచివాలయ అధికారులు ఆరా తీయమన్నట్లు తీసి నిజాలే చెప్పారా?. అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. ఎందుకంటే ఏపీ సర్కారు సోమవారం ఉదయం నుంచి ‘జగనన్న సర్కారు’ ఆ రైతుకు ఏ పథకం కింద ఎంత సాయం చేస్తుందో లెక్కలన్నింటిని మీడియాకు పంపింది.

అటు మదనపల్లికి చెందిన ఆ రైతు కానీ..ఇటు రైతుకు ఇచ్చిన మాట ప్రకారం ట్రాక్టర్ ను గంటల్లోనే ఆ రైతు దగ్గరకు చేర్చిన సోనూసూద్ కానీ ఏపీ ప్రభుత్వాన్ని కానీ..లేదా అధికారులపై ఎక్కడా ఒక్క మాట అంటే మాట కూడా మాట్లాడలేదు. కానీ సర్కారు ఎందుకు సోనూసూద్ సాయం విషయంలో ఆగమాగం అవుతోంది. దీనికి ప్రధాన కారణం ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోనూసూద్ ను అభినందిస్తూ ట్వీట్ చేయటం, ఆడపిల్లల విద్యకు తాను సాయం చేస్తానని ప్రకటించటంతో జాతీయ మీడియాలో కూడా టీడీపీ వాయిస్ పోయింది తప్ప..ఎక్కడా ఏపీ సర్కారు మాట లేకుండా పోయింది. ఇది ఏపీ సర్కారును ఇరకాటానికి గురిచేసి ఉంటుందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎంపీడీవో చెప్పినట్లు అసలు ఆ కుటుంబం పేదవాళ్లు కాదు..సరదగా గ్రామానికి వచ్చినట్లు అయితే ఆ రైతు కుటుంబానికి అమ్మ ఒడి దగ్గర నుంచి పలు పథకాలు ఎలా అందిస్తున్నారు.

అంటే అర్హులు కానీ వారికి ప్రభుత్వ పథకాలు వెళుతున్నాయా? లేక కన్వీనెంట్ గా అక్కడో మాట ఇక్కడో మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారా?. పోనీ ఆ రైతు కూడా ఎక్కడా ప్రభుత్వాన్ని మోసం చేసే ప్రయత్నం కూడా చేయలేదు. అడిగితే కూడా సాయం చేయని ఈ రోజుల్లో మీడియాలో ఫోటో చూసి స్పందించిన సోనూ సూద్ చేసిన సాయాన్ని అభినందించాల్సింది పోయి అందులో తప్పులు ఏమైనా ఉన్నాయా?. అందుకు కారణం ఎవరు అనే తరహాలో వ్యవహారించటం చర్చనీయాంశంగా మారింది. పోనీ ఏపీ సర్కారు చెప్పుకుంటున్నట్లు ప్రభుత్వం అందరికీ అందించే పథకాలు మదనపల్లి రైతుకు కూడా అందాయి. కానీ సర్కారు ఎందుకో ప్రైవేట్ వ్యక్తులు చేసిన సాయంపై ఆగమాగం అవుతుందో అర్ధం కావటంలేదని ప్రభుత్వ వర్గాలే వ్యాఖ్యనిస్తున్నాయి.

Next Story
Share it