Telugu Gateway
Cinema

టాలీవుడ్ ‘హీరోయిజం ఎక్కడ బాబులూ’ ?

టాలీవుడ్ ‘హీరోయిజం ఎక్కడ బాబులూ’ ?
X

షూటింగ్ అనుమతుల కోసం ఆరాటం

అనుమతులు వచ్చాక అందరూ మాయం!

మా హీరోయిజం ముందు కరోనా ఎంత అన్నారు?. మీరు అనుమతి ఇవ్వండి షూటింగ్ లు మొదలుపెట్టి రంగంలోకి దూకుతామన్నారు. కానీ ‘బాబులు’గా కీర్తింపబడే ఆ హీరోలు ఎక్కడ ఇప్పుడు?. ఎందుకు షూటింగ్ లు జరపటం లేదు. టాలీవుడ్ ప్రముఖులు అందరూ షూటింగ్ ల పర్మిషన్ల కోసం ప్రభుత్వాల వెంటపడ్డారు. షూటింగ్ లు ఆగిపోవటం వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. చాలా నష్టం జరుగుతోందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తో రెండుసార్లు కలిశారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తోనూపలు మార్లు భేటీలు జరిపారు. సినిమా షూటింగ్ లకు అనుమతులు లేకపోవటం వల్ల చాలా నష్టం జరుగుతుందని టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, అగ్ర దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివలతోపాటు ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు తదితరులు అంతా చాలా హైరానాపడ్డారు. చివరకు ప్రత్యేక విమానం వేసుకుని మరీ అమరావతికి తరళివెళ్లి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కూడా సమావేశం అయ్యారు. షూటింగ్ ల అంశం చర్చించటంతో పాటు ఇతర అంశాలు అక్కడ చర్చకు వచ్చాయి. మీరంతా విశాఖకు వస్తే స్టూడియోలతోపాటు మీకు ఇళ్ళ స్థలాలు కూడా ఇస్తామని ఏపీ సర్కారు నుంచి ఆఫర్ పొంది వెనక్కి వచ్చారు. షూటింగ్ ల కోసం ఇంత హంగామా చేసిన వారంతా నెల రోజులు గడుస్తున్నా అందులో ఒక్కటంటే ఒక్క రోజు కూడా షూటింగ్ లు ప్రారంభించలేదు.

షూటింగ్ అనుమతుల కోసం తిరిగిన వారికి చెందిన బ్యానర్లలో కానీ..ఆ హీరోలు కూడా ఎక్కడా షూటింగ్ లో పాల్గొన్నట్లు లేదు. అసలు భౌతికదూరం అమలులో ఉంటే అసలు సినిమా షూటింగ్ లు జరగటం సాధ్యంకాదనే విషయం తెలిసిందే. వీరంతా షూటింగ్ ల అనుమతుల కోసం వెంపర్లాడిన సమయంలోనూ రాబోయే రోజుల్లో కరోనా విభృభిస్తుందనే సంకేతాలు ఉన్నాయి. కానీ అవన్నీ పక్కన పెట్టేసి మీరు అనుమతిస్తే చాలు...మేం ఇక రంగంలోకి దిగటమే చాలన్నట్లు హీరోయిజం ప్రదర్శించారు. మరి ఇఫ్పుడు ఎక్కడ ఆ హీరోయిజం. ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినా షూటింగ్ లు ఎందుకు మొదలుపెట్టడం లేదు. వేలాది మంది కార్మికులకు ఎందుకు ఉపాధి కల్పించలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు సొంత ఏజెండాల ప్రకారం ముందుకెళ్లటం..ఆ తర్వాత మౌనంగా ఉండటం టాలీవుడ్ ప్రముఖులకు అలవాటేనని పరిశ్రమలోని ముఖ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాత ఒకటి అరా చిన్న సినిమాల షూటింగ్ లు జరిగాయి కానీ..ప్రముఖ హీరోలు ఎవరూ ఇంత వరకూ రంగంలోకి దిగలేదు. ఇప్పటికిప్పుడు వాళ్లు షూటింగ్ లకు వచ్చే మూడ్ లో కూడా లేరని చెబుతున్నారు.

Next Story
Share it