Telugu Gateway
Politics

కర్ణాటక అసెంబ్లీ..తెలంగాణ సచివాలయం డిటో!

కర్ణాటక అసెంబ్లీ..తెలంగాణ సచివాలయం డిటో!
X

ఇందులో కొత్తదనం ఎక్కడ?

తెలంగాణ సర్కారు కొత్తగా నిర్మించతలపెట్టిన సచివాలయ ‘డిజైన్’పై భిన్నస్వరాలు విన్పిస్తున్నాయి. కొత్తగా కట్టే డిజైన్ అంటే అదిరిపోయేలా ఉండాలి. ముఖ్యంగా బయటకు కన్పించే లుక్ లో వినూత్నత కన్పించాలి. రాష్ట్రానికే ప్రతిష్టాత్మకంగా ఉండే పరిపాలన కేంద్రం సచివాలయం అంటే అది ఓ ఐకానిక్ మోడల్ గా ఉండాలి. ఉదాహరణకు పాత సచివాలయంలో ఎల్ బ్లాక్ తీసుకున్నా..జె బ్లాక్ తీసుకున్నా ఆ భవనాల లుక్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకునేది. ఓ భవనాలే ఓ ఠీవి తెచ్చేవి. పాత సచివాలయంలో ఒక్కో బ్లాక్ డిఫరెంట్ లుక్ తో ఉండేవి. కానీ ముఖ్యమంత్రి కెసీఆర్ ఆమోదించారని చెబుతున్న కొత్త లుక్ అచ్చం బెంగుళూరులోని ‘విధానసౌధ’ను పోలిఉంది. పైన ఉన్న కొన్ని గుమ్మటాలు తప్ప..మిగతా అంతా సేమ్ అంటూ సేమ్. విధానసౌధ కర్ణాటక అసెంబ్లీ భవనం అన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా కొత్త సచివాలయం లుక్ పై రకరకాల విమర్శలు విన్పించాయి.

కొత్త మంది అయితే ఏకంగా టీఆర్ఎస్ భవన్ డిజైన్ నే సచివాలయానికి ఖరారు చేశారనే వ్యాఖ్యలు చేశారు. దీనికి కారణంగా టీఆర్ఎస్ భవనం, ఈ డిజైన్ పోలికలు చాలా దగ్గరగా ఉండటమే. ముఖ్యంగా కొత్త భవనం అంటే ఎలివేషన్ అదిరిపోయేలా ఉండాలి. కానీ ఇప్పుడు ఆమోదించిన లుక్ లో అది ఏ మాత్రం కన్పించటంలేదని అధికార వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే ఈ మాటను ఎవరూ ముఖ్యమంత్రి కెసీఆర్ కు చెప్పే సాహసం చేయరనే విషయం తెలిసిందే. అయితే మంత్రులు, అధికారులు, ఉద్యోగులు అందరూ ఒకే భవనంలో ఉండటం కూడా ఏ మాత్రం సరికాదనే అభిప్రాయాన్ని కూడా కొంత మంది అధికారులు వ్యక్తం చేస్తున్నారు. దీనికి వారు భధ్రతాపరమైన అంశాలతోపాటు పలు విషయాలను ప్రస్తావిస్తున్నారు. ఎలాగూ పాత సచివాలయం పడకొట్టడం ప్రారంభం అయినందున కొత్త భవనం అయినా దేశంలో ఎక్కడా లేని విధంగా విభిన్నంగా.. తెలంగాణకు ఓ ప్రత్యేకతను తెచ్చేలా ఆ భవనం ఉండాలని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it