Telugu Gateway
Politics

చుక్క నీటిని వదులుకోం..కెసీఆర్

చుక్క నీటిని వదులుకోం..కెసీఆర్
X

ఏపీతో ఏర్పడిన జల వివాదాలతోపాటు కేంద్రం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ గురువారం నాడు సమీక్ష జరిపారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. ఆగస్టు 20 తర్వాత ఎప్పుడైనా అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఓకే అని...ముందే ఖరారు అయిన ప్రభుత్వ కార్యక్రమాల వల్ల ఆగస్టు 5న సాధ్యంకాదని తెలిపారు. ఈ సమావేశంలో సీఎం కెసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రంగంలో అనేక కష్టనష్టాలకు గురైన తెలంగాణ, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా, గోదావరి జలాల్లో మన హక్కును, నీటి వాటాను కాపాడుకొని తీరాలన్నారు. ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని, ఎంతటి పోరాటానికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

ఇరు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారం విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పనితీరు హాస్యాస్పదంగా ఉన్నదని సమావేశం అసంతృప్తిని వ్యక్తం చేసింది. కొత్త రాష్ట్రాలు ఏర్పడినపుడు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నీటి వాటాల పంపిణీ సవ్యంగా జరిగేలా చూసే సాంప్రదాయం ఉందని, అయితే ఈ విషయంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని సమావేశంలో పలువురు అభిప్రాయ పడ్డారు. ఇరు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాలు లేని పరిస్థితుల్లో కేంద్రమంత్రి ఆధ్వర్యంలో నీటి పంపిణీ జరగాలి. వివాదాలున్నపుడు పరిష్కార బాధ్యతను ట్రిబ్యునల్ కు అప్పగించాలి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలు ముందునుంచీ నెలకొని ఉన్న నేపథ్యంలో, పునర్విభజన చట్టం సెక్షన్ -13ను అనుసరించి వీటిని పరిష్కరించే బాధ్యతను ట్రిబ్యునల్ కు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కోరుతూ వచ్చింది. కానీ, తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పెడచెవిన పెట్టిన తీరును సమావేశం తీవ్రంగా ఖండించింది.

ఈ విషయంలో కేంద్రం నిష్క్రియాపరత్వం ప్రదర్శిస్తున్నదనీ, ఈ దుర్మార్గ వైఖరిని ఇకనైనా విడనాడాలని సమావేశం అభిప్రాయపడింది. కేంద్రం బాధ్యతారాహిత్యం వల్ల ఇరు రాష్ట్రాలు అనవసరంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నదని సమావేశంలో ఆవేదన వ్యక్తమైంది. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న కేసులు, ట్రిబ్యునల్ వివాదాలు న్యాయబద్దంగా పరిష్కారం కావాలని, నిరంతర ఘర్షణ ఎవరికీ మంచిది కాదని సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రంగా దగాపడ్డ మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరందించేందుకు నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేసి తీరాలని, అవాంతరాల్ని లెక్క చేయకుండా ముందుకు సాగాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించించిందని తెలిపారు.

Next Story
Share it