బిజెపిపై ‘విజయసాయిరెడ్డి’ వివాదస్పద వ్యాఖ్యలు

బిజెపి అవినీతిపరులకు అడ్డాగా మారిందా?.
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి బిజెపిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్వీట్ చూస్తే అవినీతిపరులందరినీ ఆ పార్టీ ఆదరిస్తుందనే తరహాలో ఆయన ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి ట్వీట్ యతాతథంగా ‘ఏడాది కాలంగా తినడానికి ఏమీ దొరక్క నకనక లాడుతున్న టీడీపీ మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతోంది. ఇప్పటికే కొన్ని మిడతలు ఆపార్టీలో చేరి విధ్వంసం సృష్టిస్తున్న విషయం గ్రహించేలోగానే మిగతావి ఎగురుకుంటూ బయల్దేరాయి. ఈ విపత్తు నుంచి బిజెపి ఎలా బయటపడుతుందో చూడాలి.’ అంటూ ట్వీట్ చేశారు. టీడీపీ నుంచి బిజెపిలో చేరిన ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీ జీ వెంకటేష్ లతో ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించారు. దీనిపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి.
విజయసాయిరెడ్డి ట్వీట్ చూస్తే టీడీపీ నేతలు కేవలం తినటానికే బిజెపిలోకి వెళుతున్నారనే విధంగా ట్వీట్ చేయటం సంచలనంగా మారింది. విజయసాయిరెడ్డి మరో ట్వీట్ లోనూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘స్వార్థం కోసం జెండాలు మార్చేవారంతా లిటిగేటర్ల అవతారం ఎత్తుతున్నారు. ప్రజాతీర్పును అపహాస్యం చేయాలని చూస్తే ఏ వ్యవస్థా ఉపేక్షించదు. పతనమైన విలువలకు ప్రాణం పోసే యత్నం చేస్తున్న జగన్ గారిని ఈ శక్తులేవీ అడ్డుకోలేవు. మీడియా ఎంటర్ టెయినర్లుగా మిగలడం మినహా సాధించేది ఏముండదు.’ అని పేర్కొన్నారు. ఏపీలో వైసీపీకి సన్నిహితం అవుతున్న టీడీపీ నేతలు అందరూ ప్రజా సేవ చేయటానికే చేరినట్లు.. బిజెపిలో చేరబోతున్న వారంతా దోపిడీకి వెళుతున్నారనే తీరులో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయినా విజయసాయిరెడ్డి బిజెపి పార్టీ భవిష్యత్ పై అంతగా ఎందుకు ఆందోళన చెందుతున్నారనే విషయం కూడా ఆసక్తికరంగా మారింది.



