‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ మూవీ రివ్యూ
ఓ ఫోటో స్టూడియో. దాని కిందే కాళ్ళు, చేతులు విరిగిన వాళ్లకు కట్టుకట్లే ఓ నాటు వైద్య శాల. ఫోటో స్టూడియోలో సత్యదేవ్. నాటువైద్యశాలలో నరేష్. చిన్న ఊరు..అందులో ఓ ప్రేమ కథ. వినటానికి ఎంతో సింపుల్ గా ఉన్నా సినిమా మాత్రం ప్రారంభం నుంచి చివరి వరకూ అలా అలా సాగిపోతుంది. ప్రారంభంలో కాస్త స్లోగా సాగినట్లు అన్పించినా ఎక్కడా మాత్రం బోర్ కొట్టదు. అదే ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. ఈ సినిమా గురువారం నాడు ‘నెట్ ఫ్లిక్స్’ ఓటీటీలో విడుదలైంది. హీరో సత్యదేవ్ ఈ సినిమాతో సత్తా ఉండే పాత్రలు ఇస్తే తానేంటో నిరూపించుకోగలనని చూపించాడు. ఇఫ్పటివరకూ సత్యేదేవ్ చేసిన పాత్రలు వేరు..ఈ సినిమాలో సత్యదేవ్ పాత్ర వేరు. ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే హీరో మహేష్ చుట్టుపక్కల గ్రామాల్లో పెళ్ళిళ్ళు..చావుల కార్యక్రమాల ఫోటోలు తీస్తూ ఉంటాడు. చిన్నప్పటి ప్రేమిస్తున్న అమ్మాయి అమెరికా అబ్బాయి దొరికాడని బ్రేకప్ చెప్పేస్తుంది. ఓ సారి గొడవలో రౌడీలు మహేష్ ను దారుణంగా కొడతారు. దీంతో ఎప్పుడూ గొడవలకు పోని మహేష్ మంచివాడికి కోపం వస్తే ఎలా ఉంటుందో చూపిస్తా అని ..తనను కొట్టిన రౌడీని తిరిగి కొట్టే వరకూ చెప్పులు వేసుకునేది లేదని శపథం చేస్తాడు.
అంతలోనే మహేష్ ను కొట్టిన వ్యక్తి ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళటం..అక్కడ ఉద్యోగం పోయాక వచ్చిన రౌడీని చితక్కొట్టడం. చివరకు ఈ రౌడీ చెల్లెలినే ప్రేమించటం సినిమాలో కీలక సన్నివేశాలు. కేరాఫ్ కంచరపాలెం వంటి సినిమాను అందించిన దర్శకుడు వెంకటేష్ మహా ఈ సినిమాను అందించారు. కమర్షియల్ సినిమాల్లో ఉంటే సినిమాటిక్ హంగామాలు ఏమీ లేకుండా ఈ మూవీ అత్యంత కూల్ గా సాగిపోతుంది. అరకు అందాలు..ఫోటోగ్రఫీ గురించి చెప్పే డైలాగ్ లు ఆకట్టుంటాయి. ఈ సినిమాలో మహేష్ ప్రేమికురాళ్ళుగా నటించిన హరిచందన, రూపల్లో రూప పాత్రే చలాకీగా సాగుతుంది సినిమాలో. సీనియర్ నటుడు నరేష్ అయితే తన పాత్రకు వందకు వంద శాతం న్యాయం చేశాడు. సినిమాలో పలు సంభాషణలు ఆలోచన రేకెత్తించేవిగా ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సహజత్వంతో కూడిన సినిమా.
రేటింగ్. 2.75/5