Telugu Gateway
Telangana

హైకోర్టు వ్యాఖ్యలపై సీఎం సమక్షంలో అధికారుల నిరసన

హైకోర్టు వ్యాఖ్యలపై సీఎం సమక్షంలో అధికారుల నిరసన
X

కరోనా కట్టడికి ఇంత చేస్తుంటే కోర్టులు తిడతాయా?

పని వదిలి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఎంతో మెరుగ్గా ఉంది

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ మంగళవారం నాడు మరోసారి కరోనా అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా తాజాగా తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యల అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా సీఎం కెసీఆర్ మాట్లాడుతూ వైరస్ నిర్ధారిత పరీక్షలు నిర్వహించే విషయంలో, వైద్యం అందిస్తున్న తీరు, తీసుకుంటున్న జాగ్రత్తల విషయంలో పూర్తి వాస్తవాలను హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. విచారణ సందర్భంగా కోర్టుకు కావాల్సిన ఖచ్చితమైన సమాచారాన్ని వైద్యాధికారులు అందించాలని సూచించారు. హైకోర్టు అడిగిన ప్రతీ వివరాన్నీ, చేస్తున్న పనిని తెలపాలని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన కొంత మంది ఉన్నతాధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం, వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావడం పట్ల సమావేశంలో పాల్గొన్న పలువురు తమ అభిప్రాయాలు వెల్లడించారు.

‘‘కరోనా విషయంలో ఎవరు పడితే వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. హైకోర్టు ఇప్పటికి 87 పిల్స్ ను స్వీకరించింది. నిత్యం కోర్టు విచారణ వల్ల అధికారులకు ఇబ్బంది కలుగుతున్నది. కరోనా సోకిన వారికి వైద్యం అందించే విషయంలో క్షణం తీరికలేకుండా పనిచేస్తున్న వైద్యాధికారులు, ఇతర సీనియర్ అధికారులు కోర్టు చుట్టూ తిరగడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తున్నది. ఈ క్లిష్ట సమయంలో చేయాల్సిన పని వదిలి పెట్టి కోర్టుకు తిరగడం, విచారణకు సిద్ధమవడంతోనే సరిపోతున్నది. దీనివల్ల విధులకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నాం. వాస్తవానికి దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గానే ఉన్నది. మరణాల సంఖ్య తక్కువగా ఉన్నది. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం, వైద్య శాఖ, వైద్యాధికారులు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. ఎంత మందికైనా సరే వైద్యం అందించడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది. ప్రతీ రోజు వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇంత చేసినప్పటికీ హైకోర్టు వ్యాఖ్యలు చేస్తుండడం బాధ కలిగిస్తున్నది. గతంలో కూడా మృతదేహాలకు పరీక్షలు నిర్వహించాలని ఎవరో పిల్స్ దాఖలు చేశారు. దానికి అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వాస్తవ పరిస్థితిని పరిగణలోనికి తీసుకుని ఆ తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది.

అయినప్పటికీ హైకోర్టులో పిల్స్ దాఖలు అవుతూనే ఉన్నాయి. హైకోర్టు వాటిని స్వీకరిస్తూనే ఉంది. ఏకంగా 87 పిల్స్ పై విచారణ జరపడం, వాటికి నిత్యం హాజరు కావడం, చివరికి వివిధ పనుల్లో తీరికలేకుండా ఉండే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యశాఖ ముఖ్య కార్యదర్శిని, వివిధ వైద్యశాలల సూపరింటెండెంట్లను కూడా కోర్టుకు రావాలని పిలవడం ఇబ్బందిగా ఉంది. అధికారులు, వైద్యుల విలువైన సమయం కోర్టుల చుట్టూ తిరగడానికే సరిపోతున్నది. కొన్ని మీడియా సంస్థలు కూడా హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కరోనా విషయంలో ప్రభుత్వం ఏమీ చేయడం లేదనే అభిప్రాయం కలిగించేలా వార్తలు రాస్తున్నాయి. ఇది ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పనిచేస్తున్న వైద్య సిబ్బంది స్థైర్యం దెబ్బతీస్తున్నది’’ అని సమావేశంలో పాల్గొన్న పలువురు తమ నిరసన వ్యక్తం చేశారు.’. అధికారులు వ్యక్తం చేసిన ఈ అభిప్రాయాలను సీఎం కెసీఆర్ మౌనంగా విన్నారు.

Next Story
Share it