Telugu Gateway
Politics

కెసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేయాలి

కెసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేయాలి
X

సీఎం ఆరోగ్య పరిస్థితి రహస్యంగా ఉంచటం నేరం: రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్,, ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కెసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ప్రస్తుతం యాక్టివ్ సీఎం లేకుండా పోయారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ పాలన అందించలేని పరిస్థితి ఉంటే... తాత్కాలికంగా వేరొకరికి బాధ్యతలు అప్పగించాలన్నారు. సీఎం పదవి హరీష్ కో, కేటీఆర్ కో, ఈటెలకో... ఎవరికి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో పరిపాలనా సంక్షోభం ఏర్పడింది. కేసీఆర్ కి కరోనా అని వార్తలు వస్తున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి పై తక్షణం హెల్త్ బులిటెన్ విడుదల చేయాలి. సీఎం ఆరోగ్య పరిస్థితిని రహస్యంగా ఉంచడం నేరం . ప్రస్తుతం రాష్ట్రానికి యాక్టివ్ చీఫ్ మినిస్టర్ లేడు. మంత్రులు ఏం మాట్లాడాలో తెలియక పరమానందయ్య శిష్యులయ్యారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రాన్ని గాలికి వదిలేసి, సీఎం ఫాంహౌస్ లో దాక్కోవడం సరి కాదు.

గత నెల 28 నుంచి సీఎం జాడ లేదు. లాక్ డౌన్ పై కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పది రోజులైనా అతీగతీ లేదు... జనం గందరగోళంలో ఉన్నారు. గవర్నర్ జోక్యం చేసుకుని పాలనను సమీక్షించాలి. గవర్నర్ పిలిచినా రాని అధికారుల పై కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ కు గ్రేటర్ పై సర్వాధికారాలు ఉంటాయి. ఫ్రంట్ లైన్ వారియర్స్ డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు సిబ్బందికి స్పెషల్ డ్రైవ్ పెట్టి కరోనా పరీక్షలు నిర్వహించాలి. పాజిటివ్ వచ్చిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలి . సచివాలయం కూల్చివేత దుర్మార్గ చర్య. ఆ స్థలంలో కొత్త సచివాలయం కట్టడానికి ఎన్జీటీ చట్టం అనుమతించదు’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Next Story
Share it