Telugu Gateway
Politics

అంతర్గత సమస్యలతో కాంగ్రెస్..తెలంగాణలో దూకుడుగా బిజెపి

అంతర్గత సమస్యలతో కాంగ్రెస్..తెలంగాణలో దూకుడుగా బిజెపి
X

జాతీయ స్థాయిలోనే కాంగ్రెస్ కు దశ, దిశా లేకుండా పోయింది. కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న సోనియా గతంలో ఉన్నంత చురుగ్గా ఉండటం లేదు. అనారోగ్య సమస్యలతోపాటు మరెన్నో కారణాలు దీనికి కారణం అయి ఉండొచ్చు. మరో నేత రాహుల్ గాంధీ పరిస్థితి ఆ పార్టీ నేతలకే అంతుచిక్కటం లేదు. ఎన్నిసార్లు..ఎంత మంది పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టమని కోరినా రాహుల్ గాంధీ నో అంటూ వస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ విషయానికి వస్తే బిజెపి కంటే కాంగ్రెస్ పార్టీ కే క్యాడర్, లీడర్లు ఎక్కువ. పలు జిల్లాల్లో ఆ పార్టీకి పట్టు కూడా బాగానే ఉంది. కానీ గత కొంత కాలంగా తెలంగాణలో బిజెపి దూకుడు పెంచింది. పరిస్థితిని టీఆర్ఎస్ వర్సెస్ బిజెపిగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఆదివారం నాడు వరంగల్ లో జరిగిన సంఘటనలు ఇదే విషయాన్ని నిరూపిస్తున్నాయి. వరంగల్ లో మీడియాతో మాట్లాడిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏకంగా కెసీఆర్ ఫ్యామిలీపై తీవ్ర విమర్శలు చేయటంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.

బిజెపి నేతలు కూడా టీఆర్ఎస్ కు ధీటుగా అంతే ధీటుగా స్పందిస్తూ వచ్చారు. రాబోయే రోజుల్లోనూ బిజెపి ఇదే దూకుడు చూపటం ఖాయం అని చెబుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటం ఆ పార్టీకి ఓ సానుకూల అంశంగా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి అయితే విచిత్రంగా ఉంది. ఓ అడుగు ముందుకు..అది అడుగులు వెనక్కు అన్న చందంగా ఆ పార్టీ పరిస్థితి తయారైంది. పీసీసీ అధ్యక్ష మార్పు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీ కాలం కూడా ముగిసిపోయింది. ఆయన స్థానంలో కొత్త వారిని నియమించే అంశంపై ఆ పార్టీ అధిష్టానం ఏ మాత్రం ఫోకస్ పెట్టకపోవటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఓ రకమైన అనిశ్చితి రాజ్యమేలుతోంది.

బిజెపి వ్యూహాలను అనుసరించి అందుకు అనుగుణంగా దూకుడు పెంచకపోతే తెలంగాణ కాంగ్రెస్ రాబోయే రోజుల్లో మరింత కష్టాలు ఎదుర్కోకతప్పదని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో గత కొంత కాలంగా తన చేతిలో ఉన్న కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కోల్పోయింది. ఇప్పుడు రాజస్థాన్ వంతు వచ్చింది. ఇందుకు ముఖ్యంగా పార్టీ అధిష్టానం వైఖరే ప్రధాన కారణం అని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఒకప్పటి కాంగ్రెస్ ను మించిన తరహాలో ఎమ్మెల్యేల కొనుగోళ్లు, ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వాలను కూల్చటంలో కాంగ్రెస్ కంటే ఆరితేరిపోయిందనే విమర్శలు ఉన్నాయి. వీటి సంగతి ఎలా ఉన్నా చేతిలో ఉన్న ప్రభుత్వాలను కూడా కాపాడుకోలేక కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్లాపడుతోంది.

Next Story
Share it