Telugu Gateway
Politics

కెసీఆర్ ముందు చూపును అడ్డుకున్నదెవరు?

కెసీఆర్ ముందు చూపును అడ్డుకున్నదెవరు?
X

అప్పుడు వ్యతిరేకించి..ఇప్పుడు విమర్శలా

ఉస్మానియా ఆస్పత్రి వ్యవహారంపై అధికార టీఆర్ఎస్ విపక్షాలపై ఎటాక్ ప్రారంభించింది. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. సీఎం కెసీఆర్ 2015లోనే ఆస్పత్రిని సందర్శించి 24 అంతస్థుల చొప్పున రెండు టవర్లతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం చేపడతామని ప్రకటిస్తే అప్పుడు అడ్డుపడిన నాయకులు..ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శిథిలావస్థలో ఉన్న ఆస్పత్రిని చంచల్ గూడ ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేయగా ఎంసీఐ నిబంధనలతో మెడికల్ సీట్లకు కోత పడుతాయని ప్రభుత్వం తన ఆలోచనను విరమించుకుందని తెలిపారు. చరిత్రలో మొదటిసారి ఉస్మానియాలోకి నీరు వచ్చిందని..దీనికి అనేక సాంకేతిక కారణాలు ఉన్నాయని తెలిపారు. మరో మంత్రి శ్రీనివాసగౌడ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు రోజు రోజుకు దిగజారుతున్నాయని విమర్శించారు.

డెబ్బయి సంవత్సరాల్లో ఉస్మానియా గురించి ఏనాడైనా కాంగ్రెస్ నేతలు ఆలోచించారా అని ప్రశ్నించారు. ఇన్నేళ్లు గడ్డి పీకి ఇప్పుడు ఉత్తమ్ మాట్లాడుతున్నారు. ఏనాడైనా గతం లో ఉత్తమ్ ఉస్మానియా ను సందర్శించారా ? కెసిఆర్ ముందు చూపు తోనే 2015 లోనే ఉస్మానియా కు కొత్త భవనాన్ని ప్రతిపాదిస్తే అడ్డుకున్నదెవరు ?. అప్పుడు అడ్డుకున్నారు ..ఇప్పుడు ఎగిరెగిరి మాట్లాడుతున్నారు అంటూ శ్రీనివాస గౌడ్ విమర్శించారు. కాళేశ్వరం నీళ్లంటే అంత చులకనా ..ప్రతి దానికి ఆ నీళ్ళొచ్చాయంటూ బలిసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కిషన్ రెడ్డి ,దత్తాత్రేయ ,ఉత్తమ్ ,భట్టి అందరూ ఉస్మానియా కు కొత్త భవనాన్ని వ్యతిరేకించారు. కాంగ్రెస్ నేతలు 1978 నుంచి 2009 దాకా తెలంగాణ కు ఒక కొత్త మెడికల్ కాలేజీ ఎందుకు తేలేక పోయారు ?తెలంగాణ ఉద్యమం ప్రభావం తో కొత్త మెడికల్ కాలేజీలు తెచ్చారు.తెలంగాణ వచ్చాక ఐదు మెడికల్ కాలేజీలు తెచ్చాం.

ఉస్మానియా లో ఖాళీ జాగా లో నాలుగు అంతస్థులకు మించి భవనం కట్టడానికి లేదని అజ్ఞానులకు తెలియదా ? కరోనా కంటే కాంగ్రెస్సే ప్రమాదకారి అని విమర్శించారు. ప్రతిపక్షాలు సృష్టించే భయాందోళనలతో బతుకుతారనుకుంటున్న కరోనా రోగులు చనిపోతున్నారు. వైద్య రంగం లో తమ ప్రభుత్వం తెచ్చిన మార్పులేమిటోపట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కెసిఆర్ కిట్ తీసుకున్న వారిని, సీఎంఆర్ ఎఫ్ తీసుకున్న వారిని అడిగితే తెలుస్తుంది. ఉస్మానియా కు కొత్త కట్టడాన్ని ఇపుడున్న స్థలం లో కడితే అడ్డుకోబోమని ప్రతిపక్షాలు హామీ ఇస్తే ఒక్క ఏడాది లోనే అద్భుత భవనాన్ని కట్టి చూపిస్తాం .ఓ పద్ధతి ప్రకారం సీఎం కెసిఆర్ ను బద్నామ్ చేసేందుకు కాంగ్రెస్ ,బీజేపీ లు కుట్ర పన్నాయన్నారు.

Next Story
Share it