Telugu Gateway
Politics

కరోనాపై నేరుగా రంగంలోకి దిగిన తెలంగాణ గవర్నర్!

కరోనాపై నేరుగా రంగంలోకి దిగిన తెలంగాణ గవర్నర్!
X

వైరస్ నియంత్రణ చర్యలపై సమావేశం

ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో చర్చ...కీలక పరిణామం

తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందరరాజ్ నేరుగా రంగంలోకి దిగారు. కరోనా విషయంలో ఆమె ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో భేటీ కాబోతున్నారు. మంగళవారం ఉదయం పదకొండు గంటలకు ప్రైవేట్ ఆస్పత్రులతో చర్చలు జరపనున్నట్లు ఆమె స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఐసోలేషన్ సౌకర్యాలు, ఆస్పత్రుల్లో బెడ్స్, బిల్లులు, టెస్ట్ లు తదితర అంశాలపై ప్రజల ఫిర్యాదులు, పరిష్కారంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. అదే సమయంలో విజయవంతంగా కరోనా నిర్మూలనపై కూడా ఫోకస్ పెట్టనున్నట్లు తెలిపారు. స్వతహాగా డాక్టర్ అయిన గవర్నర్ తమిళ్ సై నేరుగా కరోనా వైరస్ నియంత్రణ విషయంలో ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో సమావేశం కావటవం అత్యంత కీలక పరిణామంగా మారనుంది. కొద్ది రోజుల క్రితమే గవర్నర్ తమిళ్ సై దూకుడుపై సీఎం కెసీఆర్ అసంతృప్తితో ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో ఆమె నేరుగా రంగంలోకి దిగటం కీలకంగా మారింది. విచిత్రం ఏమిటంటే గత వారం రోజులుగా ముఖ్యమంత్రి కెసీఆర్ అసలు కరోనాకు సంబంధించి సమీక్ష కానీ..ఆదేశాలు కానీ ఏమీ జారీ చేయటం లేదు. ఆయన ఎక్కడ ఉన్నారు..ఏమి చేస్తున్నారు అన్నది కూడా ఎవరికీ తెలియదు. చివరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కూడా మీడియా ముందుకు రాకుండా వైద్య శాఖ అధికారులే మీడియా ముందుకు వచ్చి వివరాలు వెల్లడిస్తున్నారు.

రాష్ట్రంలో ఈ వైరస్ కేసులు వెలుగుచూసిన తొలి రోజుల్లో కరోనా విషయంలో ప్రజలకు భరోసా ఇచ్చిన కెసీఆర్ తర్వాత తర్వాత పూర్తిగా వదిలేశారు. మీడియా ముందు మాత్రం లక్ష కేసులు వచ్చినా కూడా ఎదుర్కోవటానికి రెడీగా ఉన్నామని ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ఇంకా రాష్ట్రమంతా కలిపి కరోనా పాజిటివ్ కేసులు 25 వేలు కూడా చేరలేదు కానీ..పరిస్థితి అల్లకల్లోలం అవుతోంది. చివరకు కొన్ని రోజుల పాటు టెస్ట్ లు నిలిపివేయాల్సిన పరిస్థితి. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా టెస్ట్ లు అతి తక్కువగా ఉండగా..పాజిటివ్ రేటు చాలా ఎక్కువగా ఉంది. ఇది ఆందోళనకర పరిణామంగా నిపుణులు చెబుతున్నారు. అయినా సరే సర్కారు మాత్రం ఐసీఎంఆర్ మార్గదర్శకాలు పాటిస్తున్నామని చెబుతోంది తప్ప..టెస్ట్ ల సంఖ్యను పెంచేందుకు పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. ఈ తరుణంలో గవర్నర్ నేరుగా ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో చర్చకు పూనుకోవటం అత్యంత కీలకంగా మారింది. గవర్నర్ సమీక్ష తర్వాత పరిణామాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో వేచిచూడాల్సిందే.గవర్నర్ తమిళ్ సై ట్వీట్ కు మంది స్పందిస్తూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు.

Next Story
Share it