Telugu Gateway
Politics

హైదరాబాద్ పరిస్థితి దారుణం..జోక్యం చేసుకోండి

హైదరాబాద్ పరిస్థితి దారుణం..జోక్యం చేసుకోండి
X

ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి లేఖ

తెలంగాణలో కరోనా కట్టడి విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. ‘దేశంలోని మెట్రో న‌గ‌రాల్లో ఒక‌టైన హైద‌రాబాద్ ప‌రిస్థితి దారుణంగా మారబోతుంద‌. వెంట‌నే జోక్యం చేసుకోవాలి. దేశంలోనే అత్య‌ధిక కేసులున్న మ‌హారాష్ట్రలో క‌రోనా పాజిటివ్ రేటు 22శాతం ఉంటే, తెలంగాణ‌లో 27శాతం ఉంది. దేశ, విదేశాల‌కు హైద‌రాబాద్ నుండి ప్ర‌యాణాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఇన్ఫెక్ష‌న్ రేటు కూడా ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంది’ అని రేవంత్ తన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ సూచ‌న‌ల‌ను, హైకోర్టు ఆదేశాల‌ను, ఐసీఎంఆర్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పెడ‌చెవిన పెడుతుంద‌ని రేవంత్ లేఖ‌లో ప్ర‌స్తావించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అల‌సత్వం కార‌ణంగా రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 70వేల టెస్టులు మాత్ర‌మే జ‌రిగాయ‌ని, అదే ప‌క్క‌నున్న ఏపీలో 6ల‌క్ష‌ల వ‌ర‌కు టెస్టులు చేసిన‌ట్లు ప్ర‌ధానికి వివ‌రించారు. ఇక గ‌త నాలుగు రోజులుగా ల్యాబుల‌పై ఒత్తిడి పెరిగిపోయింద‌ని అంటూ అస‌లు టెస్టులే చేయ‌లేద‌ని, ఎక్కువ‌గా టెస్టులు చేయాల్సిన చోట చేయ‌టం లేద‌ని రేవంత్ లేఖ‌లో ప్రస్తావించారు. ఇక చేసిన టెస్టుల‌కు సైతం రిజ‌ల్ట్ ఆల‌స్యం అవుతుంద‌ని... ఈలోపు వ్యాధి ముదిరి, మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతుంద‌న్నారు.

ఏపీలో 42 ట్రూనాట్ కిట్స్ ఉంటే తెలంగాణ‌లో కేవ‌లం 22 మాత్ర‌మే ఉన్నాయ‌ని, కేవ‌లం ఒకే ఒక్క సెంట్ర‌ల్ ల్యాబ్ ఉంద‌న్నారు. ఇక టిమ్స్ ఆసుప‌త్రి అలంకారప్రాయంగా మాత్ర‌మే ఉంద‌ని, కోవిడ్ స్పెషాలిటీ ఆసుప‌త్రిగా ఉన్న గాంధీలో తీవ్ర స‌మ‌స్య‌లున్నాయ‌న్నారు. మెడిక‌ల్ వేస్ట్ కుప్ప‌లుగా పెరుక‌పోయింద‌ని మాన‌వ హ‌క్కుల సంఘం సుమోటోగా కేసును విచారిస్తున్న‌ట్లు ప్ర‌ధానికి రాసిన లేఖ‌లో రేవంత్ రెడ్డి ప్ర‌స్తావించారు. హైద‌రాబాద్, ప‌రిస‌ర ప్రాంతాల్లో ఎన్నో ప్రైవేటు మెడిక‌ల్ కాలేజీలున్న‌ప్ప‌టికీ క‌రోనాపై పోరులో వాటిని వాడుకోవ‌టం లేద‌ని విమ‌ర్శించారు రేవంత్ రెడ్డి. వెంట‌నే వాటిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని కరోనాపై పోరాడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, కార్పోరేటు ఆసుప‌త్రుల్లో చేరి వైద్యం పొంద‌లేని నిరుపేద‌ల‌కు క్వారెంటైన్, చికిత్స అందించాల‌న్నారు. కానీ చాలా వ‌ర‌కు ఇవి సీఎం కేసీఆర్ బంధువులు, మంత్రులు, వారి బంధువుల‌కు చెంద‌టంతో వాటిని ఉప‌యోగించుకోవ‌టం లేద‌ని రేవంత్ రెడ్డి ప్ర‌ధానికి రాష్ట్ర ప్ర‌భుత్వ తీరుపై ఫిర్యాదు చేశారు.

Next Story
Share it