‘పవర్ స్టార్’ మూవీ రివ్యూ
నిత్యం వివాదాలతో ఎంజాయ్ చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన తెరకెక్కించిన సినిమానే పవర్ స్టార్. మొత్తం నలభై నిమిషాల నిడివి కూడా లేని దీన్ని సినిమా అనటం కూడా కష్టమే. అందులో కేవలం 30 నిమిషాలు మాత్రమే ‘పవర్ స్టార్’ సినిమా ఉంటుంది. చివరి ఏడు నిమిషాలు విచిత్రంగా ఆర్జీవీ ఎంటరై పవర్ స్టార్ కు సలహాలు ఇస్తాడు. అంతే కాదు..2024లో వంద కాదు...రెండు వందలు కాదు..లక్ష శాతం పవర్ స్టార్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పటం..ప్రవణ్ కళ్యాణ్ ఆర్జీవిని కౌగిలించటంతో సినిమా పూర్తవుతుంది. పవర్ స్టార్ సినిమాకు సంబంధించి వర్మ విడుదల చేసిన ట్రైలర్, బిట్లు బిట్లుగా విడుదల చేసిన వీడియోలు చూస్తే చాలు..అసలు ఇక సినిమా చూడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వర్మ ఏమి చెప్పదలచుకున్నాడో...అంతా వాటిలోనే చెప్పేశాడు. రామ్ గోపాల్ వర్మ గత సినిమాల తరహాలోనూ ఇందులో ఏ మాత్రం సినిమా అన్న ఫీలింగ్ కలిగించే అంశాలేమీ లేవు. మాట్లాడితే చాలా మంది నా మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడుతుంటారు..ఆ పెళ్లిళ్ల వల్ల నాకేమీ బాధలేదు. నా భార్యలకు బాధ లేదు. మధ్యలో వీళ్ళకు ఎందుకంత బాధ..బహుశా వాళ్లకు ఒక్కతే భార్య ఉండటం వల్ల అయిఉండొచ్చు అంటూ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానిస్తాడు పవర్ స్టార్.
మీరు ఇంటర్ ఫెయిలవ్వటం వల్ల ఇంటర్ కే అందం వచ్చింది అనే డైలాగ్ కూడా జొప్పించారు ఇందులో. ‘గమ్యం ఎంత దూరమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. సముద్రాన్ని, సింహన్ని ఓదార్చేవారు ఎవరు ఉంటారు’ అని ఓ రచయిత వ్యాఖ్యానించటం, ఓట్లు కూడా మాటలంత ఇంత సింపుల్ గా ఉంటే బాగుండు అని పవర్ స్టార్ నిట్టూర్పు విడవటం హైలెట్. ఈ సినిమా ద్వారా మనసేన అధినేత ప్రవణ్ కళ్యాణ్, ఆయన సోదరుడైన టాప్ హీరో, ప్రముఖ దర్శక, మాటల రచయిత, ఓ నిర్మాతను టార్గెట్ చేశాడు వర్మ. కానీ సినిమా చివర్లో మాత్రం పవర్ స్టార్ కాళ్ల దగ్గర కూర్చుని..హితోపదేశం చేస్తాడు వర్మ. విసురుగా సీటులో నుంచి లేచి వెళ్లిపోయిన పవర్ స్టార్ కాలు ఆర్జీవికి తగిలినా తాను మాత్రం పవర్ స్టార్ ను క్షమాపణ అడగనని చెబుతాడు. ఈ 30 నిమిషాల సినిమాలో మధ్యమధ్యలో ఏదో భాష (రష్యా అనుకోవాలి) తో మాట్లాడే మహిళ కేవలం విన్పిస్తుంది. ఎక్కడా కన్పించదు. త్వరలోనే యూట్యూబ్ లో ఫ్రీగా ఈ సినిమాను విడుదల చేయకతప్పదేమో. ఎందుకంటే ఆన్ లైన్ లో 150 రూపాయలు పెట్టి టిక్కెట్ కొని..దీనికి మరో 27 రూపాయలు పన్నులు కట్టి అంటే 177 రూపాయలు వెచ్చించి చూడాల్సిన సన్నివేశాలు అందులో ఏమీ లేవు.