Telugu Gateway
Politics

కొత్త సచివాలయం..‘కెసీఆర్ అసలు లెక్క అదే’

కొత్త సచివాలయం..‘కెసీఆర్ అసలు లెక్క అదే’
X

తెలంగాణ సీఎం కెసీఆర్ కు ఏ పనిచేసినా ఓ లెక్క ఉంటుంది. ఏ లెక్క లేకుండా ఆయన అసలే ఏ పని చేయరు అని కెసీఆర్ గురించి తెలిసిన వారు చెబుతారు. ప్రస్తుతం ఉన్న సచివాలయం ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల ప్రజలకు సేవలు అందించింది. ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు..వెళ్లారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా లోపల ఏవో మార్పులు చేర్పులు చేసుకునే వారు. ఛాంబర్లను అట్టహాసంగా మార్చుకునేవారు. అంతే కానీ అసలు ఈ సచివాలయం పరిపాలనకు పనికిరాదు..వేస్ట్ అన్న చందంగా వ్యవహరించింది ఎవరూలేరు. కానీ ఆ పని తెలంగాణ సీఎం కెసీఆర్ చేశారు. కెసీఆర్ కు ఎందుకో అసలు ఈ సచివాలయం ఏ మాత్రం నచ్చలేదు. అందుకే ఆయన తొలి దఫా సీఎంగా ఉన్న నాలుగున్నర సంవత్సరాల్లో ఏదో కొన్నిసార్లు అలా వచ్చి ఇలా వెళ్ళారు కానీ..రెండవ సారి సీఎం అయిన తర్వాత అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇది అంతా పాత కథ. ప్రస్తుత సచివాలయంలో నిజాం నవాబు దగ్గర నుంచి మొదలుపెడితే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు పలువురు కొత్త బ్లాక్ లు కట్టించారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఈ సచివాలయంలో ఛాంబర్లలో మార్పులు తప్ప..పెద్దగా చేసింది ఏమీ లేదు. అందుకే కెసీఆర్ సచివాలయం విషయంలో తనదైన ‘ముద్ర’ వేయాలనుకున్నారు. కొత్త రాష్ట్రంలో కూడా ఇంకా ఈ పాత వాసనలు ఎందుకు..కొత్త రాష్ట్రం కొత్త ముద్ర తో తెలంగాణ సచివాలయం నిర్మిస్తే ఓ వందేళ్ళ పాటు కెసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అందుకే ఆయన ఈ విషయంలో చాలా పట్టుదలతో వ్యవహరించారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. టీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు ఉన్నా..తెలంగాణకు రాజధాని, అత్యంత కీలకమైన హైదరాబాద్ నగరంలో కెసీఆర్ ముద్ర అంటూ ఇప్పటివరకూ పెద్దగా ఏమీ లేదు. అందుకే వందేళ్ల పాటు కెసీఆర్ తన పేరు నిలిచిపోయేలా చేసుకునేందుకే ఈ ప్లాన్ అని దీనికి ఇప్పుడు అడ్డంకులు అన్నీ తొలగిపోయాయని చెబుతున్నారు.

కెసీఆర్ కు సెంటిమెంట్ తో కొట్టడం వెన్నతోపెట్టిన విద్య. అందుకే కొత్తగా వచ్చిన రాష్ట్రానికి కొత్త సెక్రటేరియట్ కట్టుకుంటే తప్పేంటి అనే వాదన లేవనెత్తారు. సహజంగా ఈ వాదనకు మద్దతు కూడా లభిస్తుంది. కెసీఆర్ పని సులభం అవుతుంది. అసెంబ్లీలో కొత్త సచివాలయం నిర్మాణంపై అప్పట్లో ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసినా ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు..మేం చేసింది తప్పు అయితే తర్వాత ఎన్నికల్లో వాళ్ళే చెబుతారు అంటూ తేల్చిచెప్పారు. ఇప్పుడు పాత సచివాలయం గురించి మాట్లాడుకోవాలంటే టే నిజాం గురించి, ఉమ్మడి రాష్ట్రంలోని సీఎంల గురించి మాట్లాడాల్సి ఉంటుంది. రేపు కొత్తగా కట్టే సచివాలయం పూర్తి అయితే ఒక్క కెసీఆర్ పేరు తప్ప..మరెవరి పేరు విన్పించదు. అదే అసలు కెసీఆర్ లెక్క అని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానం అందుబాటులో ఉన్న ఈ సమయంలో కొత్తగా కట్టే సచివాలయం కాబట్టి సహజంగానే అన్ని హంగులు ఉంటాయి. మరి కెసీఆర్ తన పేరు వందేళ్లు గుర్తుండిపోయేలా ఎన్ని హంగులతో దీన్ని కట్టిస్తారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it