Telugu Gateway
Politics

విస్తరణకాంక్ష ఉన్న వారు తోకముడవాల్సిందే

విస్తరణకాంక్ష ఉన్న వారు తోకముడవాల్సిందే
X

ప్రధాని నరేంద్రమోడీ చైనాకు ఘాటు హెచ్చరికలు పంపారు. శుక్రవారం నాడు ఆకస్మికంగా లద్దాఖ్ లో పర్యటించిన ఆయన అక్కడ నుంచే పొరుగు దేశం చైనాకు హెచ్చరికలు చేశారు. విస్తరణకాంక్ష ఉన్న వారు తోకముడవాల్సిందేనని హెచ్చరించారు. లేదంటే ఓటమి చవిచూడాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. లద్దాఖ్ పర్యటన సందర్భంగా సైన్యంలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు మోడీ. విస్తరణ వాదానికి కాలం చెల్లిందని..ఇది అభివృద్ధి యుగమని వ్యాఖ్యానించారు. భారత్‌ శాంతి యత్నాలకు స్పందించని చైనాపై మండిపడుతూ బలహీనులే శాంతి కోసం చొరవచూపరని ధైర్యవంతులే శాంతి కోసం పాటుపడతారని వ్యాఖ్యానించారు.భారత్‌ బలమేంటో ప్రపంచానికి తెలుసునన్నారు భారత్‌లో లద్దాఖ్ అంతర్భాగమని పేర్కొన్నారు. కష్టసమయంలో మనం పోరాటం చేస్తున్నామని విపత్కర పరిస్థితుల్లో జవాన్లు దేశానికి రక్షణగా ఉన్నారని అన్నారు.

శత్రువులకు భారత సైనికులు గట్టి గుణపాఠం చెప్పారని ప్రశంసించారు. మీ కసిని పోరాట పటిమను ప్రత్యర్ధులకు రుచిచూపించారని అన్నారు. లద్దాఖ్ నుంచి కార్గిల్‌ వరకూ మీ ధైర్యం అమోఘమని సైనికులను ప్రశంసించారు. దేశమంతా సైనికులను చూసి స్ఫూర్తి పొందుతోందని అన్నారు. మీ చేతుల్లో దేశం భద్రంగా ఉంటుందని, మీ త్యాగాలను దేశం మరువదని జవాన్ల సేవలను కొనియాడారు. సరిహద్దుల్లో మీరు ఉండబట్టే దేశం నిశ్చింతంగా ఉందని అన్నారు. మన సైనికులను చూసి తాను గర్వపడుతున్నానని చెప్పారు. గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో గాయపడిన భాఇరత జవాన్లను సైనిక స్ధావరం నిములో పరామర్శించారు. సరిహద్దు వివాదంపై భారత్‌-చైనా కమాండర్‌ స్ధాయి సమావేశాల్లో పాల్గొన్న సైనికాధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

Next Story
Share it