Telugu Gateway
Politics

పైశాచిక ఆనందం కోసమే కెసీఆర్ పై విమర్శలు

పైశాచిక ఆనందం కోసమే కెసీఆర్ పై విమర్శలు
X

లాక్ డౌన్ పెడితే ఆర్ధిక ఇబ్బందులు వస్తాయి

కరోనా విషయంలో కెసీఆర్ విఫలమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇలా కొంత మంది నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాజకీయ విమర్శలు చేయాలనుకునేవారికి నా వినతి ఏంటి అంటే ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది. ఇప్పట్లో ఏమీ ఎన్నికలు లేవు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి..నోరు పారేసుకుని పైశాచిక ఆనందం పొందటమే తప్ప..అందులో వచ్చేదేమీలేదు. ఈ సంక్షోభ సమయంలో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది, ప్రైవేట్, ప్రభుత్వ రంగం, పోలీసు రంగం వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. వ్యవస్థ విఫలమైందని...ప్రభుత్వమే విఫలమైందని మాట్లాడటం సరికాదు. విమర్శలు చేయదలచుకుంటే మేం కూడా చేయగలం. భారత దేశం కరోనా కేసుల విషయంలో మూడవ స్థానానికి పోయింది కాబట్టి ప్రధాని మోడీ విపలం అయ్యారు అని అనగలం. కానీ ఇది విమర్శలకు సమయం కాదు.’ అని తెలంగాణ మున్సిపల్, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం నాడు కరీంనగర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘ నా దృష్టిలో తెలంగాణలో అంతగా భయపడాల్సిన పనిలేదు. ఇతర ప్రాంతాలు..దేశాలతో పోలిస్తే మరణాలు రేటు మన దగ్గర చాలా తక్కువ. డేటా దాస్తున్నారు...టెస్ట్ లు చేయటం లేదు అనే విమర్శలు సరికాదు. డేటా దాస్తున్నారనే విమర్శలే అర్ధరహితం. ఓకే నిజంగా పాజిటివ్ కేసుల డేటానే దాస్తున్నారని అనుకుందాం కాసేపు. కానీ కోవిడ్ తో మరణాలు సంభవిస్తే దాన్ని దాయటం సాధ్యం అవుతుందా?. ఇప్పటికే 23 వేల మందికి కరోనా పాజిటివ్ వస్తే 60 శాతం మంది రికవరి అయి ఇంటికివెళ్లారు. కానీ వాటి గురించి ఎవరూ మాట్లాడరు..ఎవరూ రాయరు. దాదాపు 98 శాతం రికవరి అవుతున్నారు. రెండు శాతం మాత్రమే రకరకాల కారణాల వల్ల రికవరి కావటం లేదు. ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉంటే పదే పదే వాటినే చూపిస్తున్నారు. మీడియా అలా తయారైంది. మీరు ప్రజలకు ధైర్యం చెప్పాలి. దైర్యం నూరిపోయాలి. అవేర్ నెస్ పెంచాలి. లోపాలు ఉన్నాయి. లేవని మేం అనటం లేదు.

ప్రపంచం అంతటా ఉన్నాయి. అమెరికాలాంటి అగ్రరాజ్యంలో కూడా అక్కడ కూడా సరిపడా వైద్య మౌలికసదుపాయాలు లేవు. కెసీఆర్ వైఫల్యం..ఈటెల వైఫల్యం కాదు. వీటిని సరిదిద్దుకోవటం ఎలా?. వ్యాక్సిన్ వచ్చాక కావాలంటే కుస్తీ పోటీలు కూడ చేసుకోవచ్చు’ అన్నారు. 'ఎవరూ నాకు కరోనా రాదు... అనే అపోహతో ఉండొద్దు... ఇందుకు ఉదాహరణే డిప్యూటీ స్పీకర్ పద్మారావు. నేను ఓ కార్యక్రమానికి ఆయనతో కలిసి హాజరయినప్పుడు మాస్కు పెట్టుకోమంటే నాకు కరోనా రాదు అన్నారు.. కానీ మరుసటి రోజే కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు లాక్ డౌన్ పెడితే ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఫలితంగా కరోనా మరణాల కంటే లాక్ డౌన్ వల్ల సంభవించే మరణాలు ఎక్కువగా ఉంటాయన్నారు. అందుకే ప్రజలు ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకొని నియంత్రణ చేసుకోవాలన్నారు.

Next Story
Share it