Telugu Gateway
Politics

కరోనాను పూర్తిగా నియంత్రించిన రాష్టం ఉంటే చూపెట్టండి

కరోనాను పూర్తిగా నియంత్రించిన రాష్టం ఉంటే చూపెట్టండి
X

98 శాతం రికవరీ అవుతున్నారు

రెండు శాతాన్ని చూపించి తప్పుపట్టొద్దు. కెటీఆర్

తెలంగాణలో కరోనాకు సంబంధించి మున్సిపల్, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న చిన్న పొరపాట్లను పెద్దగా చూపించొద్దని మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ఏదైనా ఉంటే నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని అన్నారు. అంతే తప్ప ఈఅంశంపై రాజకీయాలు తగదన్నారు. దేశంలో కరోనాను పూర్తిగా నియంత్రించిన రాష్ట్రం ఏదైనా ఉంటే చూపించాలని ప్రతిపక్షాలను కోరారు. కరోనా విషయంలో భారత్ ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉందని..అలాంటప్పుడు దీన్ని ప్రధాని వైలఫ్యంగా భావించాలా? అని ప్రశ్నించారు. రెండు శాతం మరణాలను చూపిస్తూ 98 శాతం రికవరీలను తక్కువ చేసి చూపించొద్దని వ్యాఖ్యానించారు. కెటీఆర్ సోమవారం నాడు మహబూబ్ నగర్ లో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల భవనాలను ప్రారంభించిన అనంతరం కెటీఆర్ మాట్లాడారు. ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్న వైద్యుల నైతిక స్థైర్యం దెబ్బతినేలా ఎవరూ వ్యవహరించకూడదన్నారు. కరోనాకు చికిత్స అందించేందుకు ప్రైవేట్ ఆస్పత్రులు భయపడుతున్నాయి. సొంత కుటుంబ సభ్యులు కూడా రోగుల దగ్గరకు వెళటానికి భయపడుతున్నారు.

ఇలాంటి సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తున్న డాక్టర్లు ఏ మాత్రం భయపడకుండా ప్రాణాలకు తెగించి వైద్యం అందిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ఇంకా నమ్మకం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన వల్లే ఐదు జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకోగలిగామన్నారు. కరోనా విషయంలో ధనిక, పేద తేడాలు లేవని ఇది ఎవరికైనా రావొచ్చని వ్యాఖ్యానించారు. ఫార్మా పరిశ్రమ పట్ల ప్రజల్లో భయాందోళనలు కలిగించొద్దని..భారత్ లో తయారు అయిన మందులు ప్రపంచానికి ఉపయోగపడుతున్నాయనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటెల రాజేందర్, జిల్లా మంత్రి శ్రీనివాసగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it