Telugu Gateway
Politics

విజయసాయిరెడ్డి ట్వీట్ పై కన్నా అభ్యంతరం

విజయసాయిరెడ్డి ట్వీట్ పై కన్నా అభ్యంతరం
X

తెలుగుదేశం పార్టీ నేతలు బిజెపిలో చేరికకు సంబంధించి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్ పై బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డితోపాటు మరో ఎంపీ మిథున్ రెడ్డి ట్వీట్లు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయని ఈ విషయంలో జోక్యం చేసుకుని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం నాడు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఘాటైన పదజాలంతో లేఖ రాశారు. ఇతర పార్టీల విషయాల్లో జోక్యం చేసుకోవటం ఏ మాత్రం సరికాదని..వీరిద్దరి ట్వీట్లు అభ్యంతకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. మీరు కన్వీనెంట్ గా ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటున్న విషయాన్ని మర్చిపోయినట్లు ఉన్నారని కన్నా పేర్కొన్నారు.

వేధింపులు, బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ , తప్పుడు పోలీసు కేసుల నమోదుతో అప్రజాస్వామిక విధానాలు అనుసరిస్తూ ఇతర రాజకీయ పార్టీల నేతలను వైసీపీ చేర్చుకోవటం లేదా అని ప్రశ్నించారు. మీ పార్టీలో చేరిన వెంటనే ఇతర పార్టీల వారంతా పరిశుభ్రంగా మారిపోయారా? అని ప్రశ్నించారు. వైసిపిలో చేరే వారంతా నీతి వంతులు...ఇతర పార్టీల్లో చేరేవారు అక్రమార్కులు అన్నట్లు వైసిపి వ్యవహరిస్తోంది మా పార్టీ వ్యవహారాలపై దృష్టి మాని...సొంత పార్టీ వ్యవహారాలు చూసుకుంటే మంచింది అని కన్నా తన లేఖలో పేర్కొన్నారు. పార్టీ నేతల ట్వీట్లు, కామెంట్ల పై జగన్ తమ పార్టీ నేతలకు తగిన సూచనలు ఇవ్వాలని కన్నా తన లేఖ లో కోరారు.

Next Story
Share it