Telugu Gateway
Politics

భారతీయులకు కువైట్ షాక్

భారతీయులకు కువైట్ షాక్
X

కువైట్ కొత్తగా తీసుకొచ్చిన బిల్లు భారతీయులపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. కరోనా దెబ్బకు చమురు ధరలు గణనీయంగా పడిపోవటంతో ఆ దేశం ఇప్పుడు పలు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా దేశంలో ఉన్న విదేశీయులను వెనక్కి పంపించేందుకు రంగం సిద్ధం చేసింది. త్వరలోనే ఇది అమల్లోకి రానుందని..అంతా సవ్యంగా సాగితే భారతీయులపై ఈ నిర్ణయం ప్రభావం పెద్దగానే ఉండే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. విదేశీ కార్మికులను తగ్గించుకునేలా కువైట్ జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రవాసీ కోటా డ్రాఫ్ట్‌ బిల్లుకు ఆమోదం లభించింది. దీని ప్రభావం గల్ఫ్‌ దేశాలలో ఉన్న 8 లక్షల మంది భారతీయులపై పడనుంది. ఈ బిల్లు ప్రకారం గల్ప్‌ దేశాలలో భారతీయుల జనాభాలో 15 శాతానికి మించకూడదు. గల్ఫ్‌ లో ఉన్న విదేశీయుల జనాభాలో భారతీయులే అత్యధికంగా ఉన్నారు. ప్రస్తుతం కువైట్‌ జనాభాలో 4.3 మిలియన్లు అయితే అందులో ముప్పయి లక్షలకుపైగా ప్రవాసీయులే ఉన్నారు.

అంటే దాదాపు 8 లక్షల మంది భారతీయులను కువైట్ నుంచి తిరిగి స్వదేశానికి పంపే అవకాశం ఉంది. ఈ బిల్లులో తాము వైద్యులను, నైపుణ్యం కలిగిన మానవశక్తిని మాత్రమే నియమించుకుంటామని, నైపుణ్యం లేని కార్మికులను తిరిగి పంపించేయాలని నిర్ణయించామని తెలిపారు. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకారం.. ప్రభుత్వానికి నర్సులు, జాతీయ చమురు కంపెనీలలో వివిధ విభాగాల్లో ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్నవారు సుమారు 28 వేల మంది ఉన్నారు. మెజారిటీ భారతీయులు 5.23 లక్షల మంది ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్నారు. అదనంగా, సుమారు 1.16 లక్షల మంది డిపెండెంట్లు ఉన్నారు. వీరిలో దేశంలోని 23 భారతీయ పాఠశాలల్లో 60,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. తాజా బిల్లు వీరందరి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

Next Story
Share it