మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

మచిలీపట్నానికి చెందిన వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో పోలీసులు టీడీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారు. భాస్కరరావు హత్యకు సంబంధించి కొల్లు రవీంద్రపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఈ అంశంలో ఆయన పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం రాత్రి తుని మండలం సీతారాంపురం జాతీయ రహదారి పై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ వైపు వెళ్తున్న కొల్లు రవీంద్ర ను మఫ్టీలో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆ వెంటనే తుని నుండి విజయవాడ కు తరలించారు. హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ ను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖండించారు. కావాలనే రవీంద్రను కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు. ఎమర్జన్సీ సమయంలో కూడా ఇలాంటి అరాచకాలు లేవన్నారు. కనీసం విచారణ కూడా చేయకుండా ఎలా అరెస్ట్ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.