Telugu Gateway
Politics

ట్రంప్ సంచలన ప్రతిపాదన..సాధ్యమయ్యేనా?

ట్రంప్ సంచలన ప్రతిపాదన..సాధ్యమయ్యేనా?
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రతిపాదన పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ సారి ఎన్నికల్లో తన గెలుపు అంత ఈజీకాదనే స్పష్టమైన సంకేతాలు ట్రంప్ కు అందుతున్నట్లు ఉన్నాయి. అందుకే ఆయన ఈ మధ్య కాలంలో చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవలే తాను ఎవరికీ నచ్చటం లేదంటూ ఒకింత నిర్వేదం వ్యక్తం చేశారు. ఎన్నికలకు గడువు ముంచుకొస్తున్న వేళ డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ట్వీట్ కలకలం రేపుతోంది. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. కరోనా వైరస్‌ దృష్ట్యా దేశంలో ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని, పోస్టల్‌ బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహిస్తే అవకతవకలు జరుగుతాయని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఎన్నికల ఫలితాలు కూడా తారుమారు అయ్యే అవకాశం ఉందని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

ప్రజలంతా బయటకు వచ్చి పోలింగ్‌ బూత్‌ల ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటేనే ఎన్నికలు సజావుగా సాగే అవకాశం ఉందని, ఈ-మెయిల్‌ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు వాయిదా వేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తారని డెమాక్రాట్లు మొదటి నుంచి అనుమానిస్తున్నారు. అమెరికా జీడీపీ భారీగా క్షీణించినట్లు వార్తలు వచ్చిన కొద్దిసేపటికే ట్రంప్ ఎన్నికల వాయిదా ప్రస్తావన తీసుకొచ్చారు. 1845 సంవత్సరం నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3నే జరుగుతున్నాయి. ఈ తేదీలను మార్చటం అంత ఆషామాషిగా జరిగే వ్యవహారం కాదని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడికి కూడా ఎన్నికల తేదీలను మార్చే అధికారం లేదు. మరి ఈ పరిస్థితిని ట్రంప్ ఎలా ఎదుర్కొంటారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it