ఏ జిల్లా బాధితులకు ఆ జిల్లాలోనే కరోనా చికిత్స

కరోనా చికిత్స కోసం జిల్లాల నుంచి అందరూ హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదని..ఎక్కడికి అక్కడే చికిత్స అందిస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రభుత్వం అందుకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తోందని..నిధుల కొరత కూడా లేదన్నారు. జిల్లాల పర్యటనల్లో భాగంగా ఈటెల మంగళవారం నాడు వరంగల్ లో సమీక్ష నిర్వహించారు. ఇందులో జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ‘సామాజిక సమస్యగా మారిన కరోనే వైరస్ విస్తృతిని అడ్డుకోవడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. డబ్బులకు కొదువ లేదు. కావాల్సిందల్లా ట్రీట్ మెంటు తోపాటు వైరస్ ని ఎదుర్కొనే సంకల్పం, ధైర్యం. ఆ ధైర్యాన్ని ప్రజలకు ఇవ్వాలి. 24 గంటలపాటూ వైద్యులు అందుబాటులోఉండాలి. ఏ జిల్లా కరోనా బాధితులకు ఆ జిల్లాలోనే ట్రీట్ మెంట్ జరగాలి. అందుకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తాం.’ అని తెలిపారు.
రాష్ట్రంలో 81శాతం మంది కరోనా బాధితుల్లో ఏమాత్రం వైరస్ లక్షణాలు కనిపించడం లేదు. అందులో కేవలం 19శాతం మందికి మాత్రమే జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇందులోనూ 14శాతం మంది నయం అవుతున్నారు. కేవలం 4 నుంచి 5శాతం అంతకుముందే జబ్బులున్న సీనియర్ సిటిజన్లకు మాత్రమే సమస్య ఉంది. వాళ్ళని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం...డాక్టర్లు, సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండి, సమన్వయంతో పని చేయాలి. అని ఆదేశాలిచ్చారు. త్వరలోనే వరంగల్ లో అదనంగా 250 కరోనా పడకలు అందుబాటులోకి వస్తాయి. మరో 15రోజుల్లో పిఎంఎస్ఎస్ వై సూపర్ స్పెషాలిటీ దవాఖానాని అందుబాటులోకి తెస్తాం. అని మంత్రులు ఈటల, ఎర్రబెల్లి వివరించారు.