జగన్, నిమ్మగడ్డల భేటీ మతలబేంటి?!

సహజంగా అయితే ముఖ్యమంత్రిని ఓ పారిశ్రామికవేత్త కలిస్తే అది సాదా సీదా వార్తే. కానీ ఈ భేటీకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ లు ఇద్దరూ క్విడ్ ప్రో కో ఆరోపణలతో ప్రస్తుతం సీబీఐ కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులు ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం నిమ్మగడ్డ ప్రసాద్ తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. సీఎం నివాసంలోనే భోజనం చేసిన నిమ్మగడ్డ ప్రసాద్ ఏపీలో కొత్తగా పెట్టుబడులకు గల అవకాశాలపై చర్చించినట్లు సమాచారం. వీరిద్దరూ ముఖ్యంగా మారిటైమ్ విభాగంతో పాటు ఫార్మా రంగంలో పెట్టుబడుల అంశంపై చర్చించినట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక డెక్కన్ క్రానికల్ కథనాన్ని ప్రచురించింది. ఈ వార్త ఇఫ్పుడు అధికార వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఓ వైపు సీఎం జగన్ రాష్ట్రంలో కొత్తగా పలు ఓడరేవులను అభివృద్ధి చేయాలని తలపెట్టిన తరుణంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వాన్ పిక్ భూములు ఉన్నది కూడా ప్రకాశం జిల్లాలోనే. ఇదే జిల్లాలో ఇప్పుడు రామాయపట్నం ఓడరేవుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అందుబాటులో ఉన్న భూములతో పారిశ్రామికవాడలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రస్తుతం వాన్ పిక్ ప్రాజెక్టు న్యాయ వివాదాల్లో ఉన్న విషయం తెలిసిందే. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిమ్మగడ్డ ప్రసాద్ ఏపీలో దాదాపు ఇరవై వేల ఎకరాల్లో భారీ పారిశ్రామికవాడ ఏర్పాటుతోపాటు నిజాంపట్నం, వాడరేవుల్లో ఓడరేవులను కూడా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఇందుకు ప్రభుత్వం తన వంతుగా అనుమతులు ఇవ్వటంతోపాటు భారీ ఎత్తున భూసేకరణకు కూడా సహకరించింది. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టు పనులు జెట్ స్పీడ్ తో సాగాయి. ఈ మెగా ప్రాజెక్టును ఇవ్వటంతోపాటు భూ సేకరణలో సహకరించినందుకే నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ కు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సీఎం జగన్మోహన్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్ లకు సంబంధించిన భేటీ ఆధారిత నిర్ణయాలు రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయో వేచిచూడాల్సిందే.