Telugu Gateway
Andhra Pradesh

శాసనమండలిపై ‘జగన్ డబుల్ గేమ్’

శాసనమండలిపై ‘జగన్ డబుల్ గేమ్’
X

రద్దయ్యే మండలిలో పదవులు ఎస్సీ, మైనారిటీలకు ఇచ్చారా?.

లేక మండలి రద్దుపై పూర్తిగా వెనక్కి తగ్గరా?.

మరి అరవై కోట్ల అనవసర ఖర్చు మాటేమిటి?

‘అసెంబ్లీలోనే నిపుణులు అందరూ ఉన్నారు. అసలు పెద్దల సభ ఎందుకు?. పైగా ఈ సభ ద్వారా ఏటా 60 కోట్ల రూపాయల ఖర్చు అవుతోంది. సభ జరిగేది అరవై రోజులే. అంటే రోజుకు కోటి రూపాయల లెక్కన. పేద రాష్ట్రానికి మండలి కారణంగా ఇంత ఖర్చు అవసరమా’. అని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గంభీరంగా ప్రశ్నించారు. ఆ తర్వాత మండలి రద్దు చేస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కరోనాతో సహా కారణాలు ఏమైనా అక్కడ పని జరగలేదు. మధ్యలోనే రాజీనామా చేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్ సీటుకు ఎన్నిక వచ్చింది. మళ్ళీ ఆయన్నే పోటీకి నిలిపి వైసీపీ పని పూర్తి చేసింది. అది అంటే ఎన్నికల కమిషన్ నిర్వహించే ఎన్నిక కాబట్టి తప్పనిసరిగా ఆ షెడ్యూల్ ఫాలో కావాల్సిందే. కానీ సీఎం జగన్ కు నిజంగా మండలి రద్దు చేయాలనే ఉంటే గవర్నర్ కోటాలో ఖాళీలను ఇప్పటికిప్పుడు భర్తీ చేయాల్సిన అవసరం లేదు. అది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయంపైనే ఆదారపడి ఉంటుంది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు భర్తీ చేసుకోవచ్చు.

ఏటా అరవై కోట్లు వృధా. పేద రాష్ట్రం అని చెప్పిన జగన్ ఇంత హడావుడిగా రెండు ఖాళీల భర్తీకి మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు, జకియా ఖానమ్ పేర్లను గవర్నర్ కు సిఫారసు చేయటం వెనక మతలబు ఏంటి?. అంటే సీఎం జగన్ తన అమరావతి అవసరం తీరిపోయింది కాబట్టి మండలి రద్దు ఇక అవసరం లేదని భావిస్తున్నారా?. లేదా రేపో మాపో రద్దయ్యే మండలిలో ఒక ఎస్సీ, మైనారిటీ మహిళలకు చోటు కల్పించి..నేను ఇచ్చాను కానీ మండలి రద్దు అయింది అని చెబుతారా?. మండలి రద్దు అవుతుందో కాదో అన్న విషయం జగన్ కు మాత్రమే తెలుసు. తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే సీఎం జగన్ మండలి రద్దు కోసం ఇక కేంద్రంపై ఒత్తిడి చేయబోరని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

రాబోయే రోజుల్లో వచ్చే సీట్లు అన్నీ తమ ఖాతాలోకి వస్తాయి కాబట్టి ఇక మండలి రద్దు అవసరం లేదని వైసీపీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పిన పేద రాష్ట్రం..అరవై కోట్ల వ్యయం మాటలు అన్నీ ఏమి కావాలి. అప్పటి అవసరం కోసం ఎన్నో చెబుతాం..అన్నీ ఫాలో అవుతామా ఏంటి అంటారా?. రాజకీయాల్లో ఉన్న వారికే ఎప్పటి అవసరాలకు అనుగుణంగా అప్పటి మాటలు చెప్పే వెసులుబాటు ఉంటుంది. ఐదేళ్ళలో మండలి కోసం మూడు వందల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని కూడా జగన్ లెక్కలేసి మరీ చెప్పారు.

Next Story
Share it