Telugu Gateway
Politics

చైనా బలగాలు వెనక్కి

చైనా బలగాలు వెనక్కి
X

కీలక పరిణామం. భారత్-చైనా సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలు తొలిగేందుకు తొలి అడుగు పడింది. ఉద్రిక్తతలకు కారణం అయిన గల్వాన్ లోయ నుంచి చైనా పీపుల్స్ ఆర్మీకి చెందిన సైన్యం కిలోమీటర్ మేర వెనక్కి పోయింది. దీంతో అక్కడ అక్రమంగా నిర్మించిన వాటిని కూడా కూల్చివేశారు. చైనా వెనక్కి తగ్గటంతో భారత సైన్యం కూడా ఆ మేరకు వెనక్కి వచ్చేసింది. చర్చల్లో భాగంగానే ఇది అంతా సాగినట్లు చెబుతున్నారు. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా ‘బఫర్‌ జోన్‌’ ఏర్పాటు చేసినట్లు వెల్లడించాయి. డ్రాగన్‌ దొంగదెబ్బకు భారత్ ధీటుగా స్పందిస్తుండటంతో వెనక్కి తగ్గిన చైనా ఈ మేరకు జరిగిన చర్చల్లో బలగాల ఉపసంహరణకు అంగీకరించినట్లు తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్‌ లోయ ప్రాంతంలోని భారత భూభాగంలో పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 వద్ద అక్రమంగా వేసిన గుడారాన్ని తొలగించమని భారత సైనికులు సూచించగా.. చైనా ఆర్మీ జూన్‌ 15న దాడికి తెగబడిన విషయం తెలిసిందే. రాళ్లు, ఇనుప రాడ్లను ఉపయోగించి భారత సైనికులను దొంగదెబ్బ కొట్టారు.

ఈ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయి చేరాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్- చైనా మధ్య వివిధ స్థాయిల్లో మూడు దఫాలుగా చర్చలు జరిగాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్‌లో శుక్రవారం ఆకస్మిక పర్యటన జరిపిన విషయం తెలిసిందే. గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణల్లో అమరులైన సైనికుల త్యాగాలను కొనియాడుతూనే.. విస్తరణ వాదానికి కాలం చెల్లిందంటూ చైనాను ఉద్దేశించి గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

Next Story
Share it