Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు ‘సింగపూర్ సేల్’..జగన్‘లోకల్ సేల్’

చంద్రబాబు ‘సింగపూర్ సేల్’..జగన్‘లోకల్ సేల్’
X

తేడా ఏముంది?. చంద్రబాబునాయుడు సింగపూర్ కంపెనీలకు భూములు అమ్మితే..సీఎం జగన్ అదే భూములను స్థానికులకు అమ్ముతానంటున్నారు. ఇద్దరూ చేసేది రైతుల భూములతో వ్యాపారమే. ప్రతిపక్షంలో ఉండగా తాము అధికారంలో వస్తే అమరావతి భూములు వెనక్కి ఇచ్చేస్తామని చెప్పి వాళ్లు ఇప్పుడు ఆ మాట మాట్లాడటం లేదు. పైగా రైతులను బెదిరించి..బలవంతం చేసి భూములు లాక్కున్నారని ఆరోపించిన వారు ఇప్పుడు అవే భూములను అమ్మకానికి పెడుతున్నారు. అంటే రాజధాని పేరుతో ల్యాండ్ పూలింగ్ లో రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూములను వేలం వేసి ఆ డబ్బులతో విశాఖపట్నంలో రాజధాని కడతారా?. అంటే ఖచ్చితంగా ఇవే డబ్బులు అని చెప్పకపోయినా.. ఈ భూములు అమ్మి ఖజానాలో వేసుకుంటారు కాబట్టి అవి ఎక్కడికైనా వెళ్లొచ్చు. చంద్రబాబు హయాంలో సింగపూర్ కన్సార్టియానికి అప్పగించేందుకు రెడీ చేసిన 1600 ఎకరాల భూములను వేలం వేయనున్నట్లు మిషన్ బిల్డ్ ఏపీ కింద అమ్మకానికి పెడుతున్నట్లు కోర్టుకు నివేదించారు.

ఈ నిర్ణయం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలోనే తీసుకున్నారు. అప్పట్లో చంద్రబాబునాయుడు చెప్పింది ఇదే. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని. అందులో సొంత ప్రయోజనాలు..స్వప్రయోజనాలు..స్కామ్ లు చాలా ఉండొచ్చు. ఇది వేరే సంగతి. రైతుల దగ్గర తీసుకున్న భూములను వివిధ విదేశీ, స్వదేశీ సంస్థలకు అమ్మి అక్కడే అభివృద్ధి చేయటం. దీని వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. భూములు ఇచ్చిన వారు కూడా లాభపడతారు. కానీ సీఎం జగన్ మాత్రం ఇక్కడ భూములు అమ్మి ఆ డబ్బులు ఎక్కడో పెడతానంటున్నారు. పోనీ అమరావతి భూముల అమ్మకం ద్వారా వచ్చిన నిధులను ఆ ప్రాంతంలోని అవసరాలకే వాడతారని ఏమైనా చెబుతారా?. అంటే దీనిపై ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు. మామూలుగా అయితే ఇలాంటి అవసరం ఉండదు. కానీ గత ప్రభుత్వం రాజధాని పేరుతో రైతుల దగ్గర నుంచి వేలాది ఎకరాలు తీసుకుని..వాళ్లకు వాణిజ్య స్థలాలు ఇస్తామని హామీ ఇఛ్చింది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కొంత బాధ్యత ఉంటుంది.

చంద్రబాబు హయాంలో రాజధాని అమరావతి ప్రచారం పీక్ కు వెళ్లింది కాబట్టి అక్కడ ఎకరా నాలుగు కోట్ల రూపాయల లెక్కన కూడా విక్రయించారు. ఇప్పుడు అందులో సగానికి సగం అంటే రెండు కోట్ల రూపాయల లెక్కన వేసుకున్నా 1600 ఎకరాలు అమ్మితే 3200 కోట్ల రూపాయలు వస్తుంది. ప్రభుత్వం వద్ద ఇంకా రాజధాని కోసం సేకరించిన భూమి వేల ఎకరాలు మిగిలి ఉంది. మరి ఆ భూమిని కూడా అమ్మకానికి పెడతారా?. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా సర్కారు ఇప్పుడు అసలు అమరావతిలోనే రాజధాని లేకుండా చేశారు. అలా అంటే ఊరుకోరేమో..శాసన రాజధానిగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు కాబట్టి. అంటే ఏడాదిలో ఓ అరవై రోజుల పాటు జరిగే అసెంబ్లీ మాత్రమే ఇక్కడ ఉంటుంది. ప్రతిరోజూ కార్యకలాపాలు జరిగే కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నానికి వెళుతుంది. జగన్ సర్కారు టార్గెట్ అంతా అమరావతిలో భూములు టీడీపీ నేతల చేతుల్లో.. ఉన్నందున ఇక్కడ రాజధాని కట్టి వాళ్లకు లాభం చేయటం ఎందుకు అన్నదే. ఈ విషయాన్ని స్వయంగా బొత్స లాంటి మంత్రులే బాహటంగా చెబుతున్నారు.

Next Story
Share it