Telugu Gateway
Telangana

జీవీకె గ్రూపు ఛైర్మన్ కృష్ణారెడ్డి, సంజయ్ రెడ్డిలపై సీబీఐ కేసు

జీవీకె గ్రూపు ఛైర్మన్ కృష్ణారెడ్డి, సంజయ్ రెడ్డిలపై సీబీఐ కేసు
X

705 కోట్లు దారిమళ్లించిన జీవీకె

ముంబయ్ విమానాశ్రయం ప్రాజెక్టులో గోల్ మాల్

దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ముంబయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టులో భారీ గోల్ మాల్. ఈ ప్రాజెక్టు డెవలపర్ అయిన జీవీకె గ్రూపు దొంగ ఒప్పందాలతో ఏకంగా 705 కోట్ల రూపాయల మేర నిధులను దారి మళ్ళించినట్లు సీబీఐ కేసు నమోదు చేసింది. తద్వారా ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ పోర్ట్స్ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు భారీ నష్టానికి కారణమైందని పేర్కొన్నారు. ఈ అక్రమాలకు ఏఏఐలోని కొంత మంది అధికారులు కూడా సహకరించినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. జీవీకె గ్రూప్ ముంబయ్ విమానాశ్రయాన్ని ముంబయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ (ఎంఐఏఎల్) పేరుతో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో జీవీకె గ్రూపుతోపాటు ఏఏఐ, కొన్ని విదేశీ కంపెనీలు భాగస్వాములుగా ఉన్నాయి. పలు అక్రమ మార్గాల్లో ఏఏఐ అధికారులతో కుమ్మక్కు అయి నిధుల దారి మళ్ళించినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. బోగస్ వర్క్ కాంట్రాక్ట్ లు, మిగుల నిధులను దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. ఎంఏఏఎల్ ప్రధాన కార్యాలయం ముంబయ్ అయితే..నిధులతో అక్కడ కాకుండా హైదరాబాద్ బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ రిసీప్ట్స్ (ఎప్ డీఆర్)లు పెట్టి ..వాటిపై రుణాలు తీసుకుని జీవీకె గ్రూప్ సొంత అవసరాల కోసం వాడుకున్నట్లు తేల్చారు.

జీవీకె ఎయిర్ పోర్ట్ హోల్డింగ్స్, ముంబయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్, గునుపాటి వెంకటకృష్ణారెడ్డి, గునుపాటి సంజయ్ రెడ్డిలు ఐశ్వరగిరి కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, కోటియా ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ బికె ట్రేడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, సుభాష్ ఇన్ ఫ్రా ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అక్వాటెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎం వి ఓమ్ని ప్రాజెక్టు ఇండియా లిమిటెట్, నైస్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఏఏఐ అధికారులతో కుమ్మక్కు అయి 705 కోట్ల రూపాయల మేర అక్రమమార్గంలో ప్రయోజనం పొందినట్లు తేల్చారు. దీంతోపాటు విమానాశ్రయంలో ఉన్న అత్యంత విలువైన కమర్షియల్ ప్రాజెక్టులో కూడా ప్రమోటర్ల బంధువులు, ఉద్యోగుల పేర్లతో అతి తక్కువ ధరకు లీజుకు తీసుకుని జాయింట్ వెంచర్ ఒప్పందానికి తూట్లు పొడిచినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

ఎంఐఏఎల్ వ్యయాలను ఎక్కువ చేసి చూపించటం ద్వారా ఏకంగా 100 కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. జీవీకె గ్రూప్ కంపెనీలకు చెందిన ఉద్యోగులను కూడా ఎంఏఐఎల్ జాబితాలో చూపించి వారికి వేతనాలు చెల్లించారు. ఇది ఒప్పందానికి విరుద్ధం. ఇలా నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేయటం ద్వారా ఏఏఐ ఆదాయానికి గండికొట్టారు. ఆపరేషన్, మెయింట్ నెన్స్ అభివృద్ధి ఒప్పందానికి (ఓఎండీఏ) భిన్నంగా జీవీకె గ్రూప్ ప్రతినిధులు ఎంఏఐఎల్ నిధులను దుర్వినియోగం చేశారు. అది ఎంతలా అంటే కుటుంబ సభ్యులతో పాటు జీవీకె గ్రూప్ ఉద్యోగులు కూడా ఇదే ఖాతాలో విమాన/రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవటంతో పాటు హోటల్ గదుల బుకింగ్స్ కూడ చేసుకున్నారు. వాస్తవానికి వీళ్ళెవరూ ఎంఏఐఎల్ తో సంబంధం ఉన్న వారు కాదు. ఆర్బిట్ ట్రావెల్ అండ్ టూర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్ధ ద్వారా ఇది అంతా నడిపించారు. ఉద్దేశపూర్వకంగానే కొంత మంది ఏఏఐ అధికారులతో కుమ్మక్కు అయి ఈ చర్యలకు పాల్పడినట్లు గుర్తించారు. ఇంత జరుగుతున్నా కూడా ఏఏఐ మాత్రం గుడ్డిగా చూస్తూ ఉండిపోయింది.

Next Story
Share it