Telugu Gateway
Politics

కరోనా తీవ్రతకు అనుగుణంగా ప్రభుత్వ చర్యలు లేవు

కరోనా తీవ్రతకు అనుగుణంగా ప్రభుత్వ చర్యలు లేవు
X

అమరావతి రైతులకు అండగా ఉంటాం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో కరోనా పరిస్థితిపై ప్రభుత్వం మరింత సమర్ధవంతంగా వ్యవహరించాలన్నారు. టెస్ట్ లు పెద్ద సంఖ్యలో చేస్తున్నా ఆస్పత్రుల్లో సౌకర్యాలు, రోగుల విషయంలో శ్రద్ధ సరిగాలేదన్నారు. ఏపీలో ప్రస్తుతం రోజుకు నాలుగు వేలు..ఐదు వేల కేసులు నమోదు అవుతున్నా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించటం లేదని విమర్శించారు. మంగళవారం ఉదయం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయింది. ఇందులో కోవిడ్ పాజిటివ్ కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతుండటంతోపాటు నిలిచిపోయిన గృహనిర్మాణ ప్రాజెక్టులు, ఇళ్ల పట్టాల వ్యవహారం, రాజధాని వికేంద్రీకరణ, రేషన్ కార్డుల తొలగింపు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇందులో రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఉభయగోదావరి జిల్లాల ఇంచార్జ్,పి.ఎ.సి. సభ్యులు శ కె.నాగబాబు, ప్రధాన కార్యదర్శులు తోట చంద్ర శేఖర్, టి.శివశంకర్, సత్య బొలిశెట్టి పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం నిధులతో రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలోనే గృహ నిర్మాణాలు మొదలైతే పూర్తయినవాటిని ఇప్పటికీ లబ్ధిదారులకు అందచేయకపోవడంపై చర్చించారు. 3.10 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే నిర్మాణం పూర్తయినవాటిని లబ్ధిదారులకు అంగీకరించకపోవడం దురదృష్టకరమనీ, పేద ప్రజలను ఇబ్బందిపెట్టడమే అవుతుందని సమావేశం అభిప్రాయపడింది. ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇస్తామని భూములు కొనుగోలు చేసే వ్యవహారంలో అధికార పక్షం పలు అక్రమాలకు పాల్పడటంతోపాటు అసైన్డ్ భూములు తీసుకోవడంపై చర్చించారు. గృహ నిర్మాణంపై ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీతో కలసి బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కరోనా రోగులకు సరైన ఆహారం అందటం లేదు, నాణ్యత లేదు అని వస్తున్న ఫిర్యాదులపై ఏ చర్యలు తీసుకున్నారు? అలాగే ఆసుపత్రుల్లో శానిటేషన్ మెరుగుపడాల్సిన అవసరం ఉంది. వెంటిలేటర్లు, బెడ్స్ సమస్యలు ఉన్నాయి. వీటన్నింటిపై దృష్టిపెట్టకుండా ఇది సాధారణ జ్వరం అంటే ఎలా? అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. అభివృద్ధి వికేంద్రీకరణను అందరూ స్వాగతిస్తారు. రాజధాని వికేంద్రీకరణతోనే అది సాధ్యం అని ప్రభుత్వం మొండిగా వెళ్తోంది. రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సి.ఆర్.డి.ఏ. రద్దు బిల్లు గవర్నర్ ముందు ఉన్నాయి.

అన్ని కోణాల్లో ఆలోచన చేయాలి. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. రాజధాని నిర్మిస్తాం అంటేనే 29వేల మంది రైతులు 34వేల ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చారు.. వారి త్యాగాలను గుర్తించాలి. రాజధాని రైతులకు బాసటగా నిలుస్తామని తెలిపారు. రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “కరోనాకు సంబంధించిన చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తోంది. కేంద్రం నుంచి రూ.600 కోట్లు నిధులు వచ్చాయి. కానీ తగిన విధంగా ప్రజారోగ్యంపై దృష్టిపెట్టడం లేదు. గృహ నిర్మాణం, ఇళ్ల పట్టాలకు సంబంధించిన కార్యక్రమాలలోని అవకతవకలపై బీజేపీతో కలసి ఆందోళన చేపట్టాలి. ఇళ్ల స్థలాలకు సంబంధించిన అవకతవకలపై అధికార పార్టీ ఎంపీయే స్వయంగా ప్రకటన చేశారు. రాజమండ్రి, కావలిలో కుంభకోణాలు వెలుగు చూశాయి. కావలిలో అవకతవకలకు అడ్డు చెప్పినందుకే నెల్లూరు కలెక్టర్ ను బదిలీ చేశారని వార్తలు కూడా వచ్చాయి” అన్నారు.

Next Story
Share it