న్యాయసలహా తర్వాతే ఆ బిల్లులపై గవర్నర్ సంతకం!

అత్యంత కీలకమైన పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్ డీఏ రద్దు బిల్లులను ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిందన్ వెంటనే ఆమోదిస్తారా?. లేక న్యాయ సలహా తీసుకుంటారా?. అన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపునకు సంబంధించి ఏపీ సర్కారు తెచ్చిన ఆర్డినెన్స్ పై ఆగమేఘాల మీద సంతకం పెట్టి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విమర్శల పాలయ్యారు. ఈ ఆర్డినెన్స్ చెల్లుబాటు కాదని హైకోర్టు తీర్పు ఇచ్చింది.
అదే సమయంలో ఆయన రాజకీయపరంగా కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని గవర్నర్ ఈ సారి న్యాయసలహా తీసుకున్న తర్వాతే ఈ బిల్లులపై ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనికి తోడు టీడీపీ నేతలు చాలా ముందస్తుగా లేఖలు రాశారు. దీంతో ముందు న్యాయ సలహా తీసుకున్న తర్వాతే గవర్నర్ ఆమోదం తెలుపుతారని అధికార వర్గాలు తెలిపాయి. ఏది ఏమైనా వారం రోజుల్లోనే ఈ వ్యవహారం తేలిపోనుంది.