‘‘ఫ్యూడలిస్ట్ పాలించే ఫెడరల్ స్టేట్’’ గా ఏపి

రెండు బిల్లులు కేంద్రానికి పంపడంలో ఎందుకింత జాప్యం..?
ఎస్ ఈసి గా రమేష్ కుమార్ నియామకంలో ఎందుకింత తాత్సారం..?
తెలుగుదేశం సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, ఏపీ సర్కారుకు పలు ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా ఆయన రాజధానికి సంబంధించిన బిల్లులు, ఎస్ఈ సీ రమేష్ కుమార్ అంశాలపై స్పందించారు. గవర్నర్ తక్షణమే పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్ డీఏ రద్దు బిల్లులను రాష్ట్రపతికి పంపాలన్నారు. దీనికి సంబంధించి ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. ‘ఈ 2బిల్లులపై ఆర్టికల్ 200,201 ప్రకారం రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాలి
‘‘ఒక రాజధాని(A Capital)’’ అనే విభజన చట్టం సెక్షన్ 5(2)(1), సెక్షన్ 6లో ఉంది.సెక్షన్లు 94(3),94(4) ప్రకారమే కేంద్రం ఇచ్చిన నిధులతో రాజధాని ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో అధికార పరిధి అతిక్రమణ జరుగుతోంది. ఆర్టికల్ 200కింద రాష్ట్రపతి ఆమోదం మినహా ఈ రెండు బిల్లులపై ప్రత్యామ్నాయం లేదు’ అని యనమల పేర్కొన్నారు. గవర్నర్ ఈ రెండు బిల్లులను ఆర్టికల్ 200కింద కేంద్రానికి పంపకుండా ఎందుకింత తీవ్ర జాప్యం చేస్తున్నారనేది మా మొదటి ప్రశ్న.
రెండవది రాష్ట్ర ఎన్నికల అధికారిగా రమేష్ కుమార్ ను కొనసాగించాలని సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎస్ ఈసి నియామకంలో గవర్నర్ ఎందుకింత తాత్సారం చేస్తున్నారు.? కోర్టులు చెప్పినట్లే ఆంధ్రప్రదేశ్ లో ఆర్టికల్ 243(కె)ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించడం అక్షర సత్యం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ రెండు బిల్లుల కథ ముగించేందుకు ఆర్టికల్ 256, 257, 355 వినియోగించాల్సిన సరైన సమయం ఇదే. ఆర్టికల్ 356 మరియు ఆర్టికల్ 360 ఈ బిల్లులపై వినియోగించాలని తెలుగుదేశం పార్టీ కోరడం లేదు. కేంద్రప్రభుత్వం చేసిన ఏపి పునర్వవస్థీకరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఈ రెండు బిల్లులను శాసన సభ, శాసన మండలికి తెచ్చింది కాబట్టి, తక్షణమే కేంద్రం ఇందులో జోక్యం చేసుకుని సెటిల్ చేయాలి. సమాఖ్య రాజ్యం(ఫెడరల్ స్టేట్)గా మనదేశాన్ని రాజ్యాంగం పేర్కొన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ‘‘ఫ్యూడలిస్ట్ పాలించే ఫెడరల్ స్టేట్’’ అయ్యింది అనేది మా నిశ్చితాభిప్రాయం.’ అని పేర్కొన్నారు.