Telugu Gateway
Andhra Pradesh

వైసీపీలో ‘అసంతృప్తి’కి అవి సంకేతాలా?

వైసీపీలో ‘అసంతృప్తి’కి అవి సంకేతాలా?
X

అధికార పార్టీలో రఘురామకృష్ణంరాజు...ఆనం వ్యాఖ్యల కలకలం

నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధుల్లేవ్

గత కొంత కాలంగా అధికార వైసీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఇప్పుడు బయటపడుతోందా?.రాబోయే రోజుల్లో ధిక్కార స్వరాలు మరింత పెరిగే అవకాశం ఉందా?. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏకంగా వివిధ సంక్షేమ పథకాల పేరుతో ప్రజల ఖాతాల్లోకి నేరుగా 40 వేల కోట్ల రూపాయలుపైగా జమ చేశారు. ఎమ్మెల్యేలకు సీఎం జగన్ తో కలిసే అవకాశం రాకపోవటం, నియోజకవర్గాలకు చెందిన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఏమాత్రం అందకపోవటం ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అప్పులుగా తెచ్చిన నిధులతోపాటు సర్కారుకు వచ్చే ఆదాయం అంతా సంక్షేమ రంగంపై ఖర్చుకు..ఉద్యోగుల వేతనాలు...అప్పులు కట్టేందుకే సరిపోతోంది. దీంతో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు అందుబాటులో ఉండటం లేదు. ఎమ్మెల్యేలతో భేటీ అయితే వారి నుంచి రోడ్లతోపాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వినతులు వస్తాయని వాటికి నిధులు కేటాయించే పరిస్థితి లేనందునే సీఎం జగన్ ఎమ్మెల్యేలతో భేటీకి కూడా ఆసక్తిచూపటంలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గత ఎన్నికల్లో 151 సీట్లతో గెలిచి ఊఫులో ఉన్నందున ఇంత కాలం ఎలాంటి పనులు జరగకపోయినా ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటూ వచ్చారని...రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేల స్వరం కూడా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా వైసీపీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణంరాజు సర్కారు తీరును మీడియా వేదికగానే తప్పుపడుతున్నారు. టీటీడీ భూముల వేలం ప్రతిపాదనను తప్పుపట్టిన ఆయన తాజాగా ఇసుకకు సంబంధించి సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు అంతే కాదు..సాక్ష్యాత్తూ సీఎం జగన్ చుట్టూనే శక్తివంతమైన కోటరీ ఉందని..ఆయనకు నిజాలు తెలియనీయటంలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పార్లమెంట్ వేదికగా తెలుగు మాధ్యమానికి సంబంధించి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు ఆయన వివరణ కోరారు. తాజాగా రఘురామకృష్ణం రాజు రాష్ట్రంలో ఇసుక మాయం అవుతోందని.ఎంతో పేరున్న ఓ డాక్టర్ లారీ ఇసుక అడిగితే కూడా తాను ఇప్పించలేకపోయానని ప్రకటించారు. వైఎస్ హయాంలో ఇసుక ఎంతో బాగా దొరికేదని అన్నారు.

సంక్షేమ కార్యక్రమాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఇసుకలో వచ్చే డబ్బుల కోసం ప్రభుత్వం చూడాలా? అని ప్రశ్నించారు. ఇసుక అక్రమాల్లో వైసీపీతోపాటు టీడీపీ, ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా ఉంటారని తెలిపారు. సీఎం జగన్ మాత్రం ఇసుకలో అక్రమాలకు ఛాన్స్ లేకుండా ఉండేందుకు అని స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోను ఏర్పాటు చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. లాక్ డౌన్ పీరియడ్ లో ఇసుక భారీ ఎత్తున తరలించారని..అది స్టాక్ పాయింట్లకు కాకుండా మరో చోటకు పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిని సమర్ధించేలా అధికార పార్టీ ఎంపీ వ్యాఖ్యలు ఉన్నాయి. వైసీపీలో ఓ వైపు రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తుంటే మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఏడాది పాలనలో కేకు సంబరాలు తప్ప తన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. సీఎం లేఖకే దిక్కులేని పరిస్థితి ఉందన్నారు.

మంత్రులు, అధికారులు సీఎం లేఖనే పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కొంత మంది నీళ్ళు అమ్ముకుంటున్నారని ఆరోపించటంతోపాటు..మరో ఏడాది వేచి చూస్తానని,పనులు జరగకపోతే ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వెనుకాడనని వ్యాఖ్యానించటం విశేషం. 23 జిల్లాలకు మంత్రిగా పనిచేసిన తనకు ఎమ్మెల్యే పదవి గొప్పేమీ కాదన్నారు. ప్రస్తుతానికి బయటపడింది వీళ్ళిద్దరే అయినా చాలా మంది ఎమ్మెల్యేల్లో మాత్రం రహదారులతోపాటు పలు అంశాలకు పనులు ఏ మాత్రం ముందుకు సాగకపోవటంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని..వాళ్ళంతా కూడా బయటపడి మాట్లాడితే పార్టీకి చిక్కులు తప్పవని వ్యాఖ్యానిస్తున్నాయి. ఇంకా అధికారం నాలుగేళ్ల పాటు ఉన్నందున అంత తొందరగా ఎమ్మెల్యులు అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచే అవకాశం ఉండకవచ్చని..కాకపోతే రకరకాల కారణాలతో ఉక్కపోతను ఎదుర్కొనే కొంత మంది మాత్రం బయటపడే అవకాశం ఉందని ఓ సీనియర్ నేత తెలిపారు.

Next Story
Share it