Telugu Gateway
Andhra Pradesh

వైసీపీ ఎమ్మెల్యేల ‘వివరణ’లతో కొత్త చిక్కు!

వైసీపీ ఎమ్మెల్యేల ‘వివరణ’లతో కొత్త చిక్కు!
X

‘మేం అధికారుల తీరునే తప్పుపడుతున్నాం. అధిష్టానంపై అసంతృప్తా?. ఛీ..మాకెందుకు అలా ఉంటుంది. అసలు సీఎం జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే అసంతృప్తి ఉండాల్సిన అవసరం ఏముంది?’ అంటూ ఎదురుప్రశ్నలు సంధిస్తున్నారు వైసీపీ నేతలు. గత కొన్ని రోజులుగా వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు గా పనిచేసిన వారు ఇసుక సమస్య గురించి మొదలు పలు విషయాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏడాది కాలంలో తమ తమ నియోజకవర్గాల్లో రహదారులు మొదలుకుని ఎలాంటి విషయాల్లో పురోగతి లేదని చాలా మంది చెబుతున్నారు. కొంత మంది బహిరంగంగానే ఈ విషయాన్ని వెల్లడిస్తే అంతర్గత సంభాషణల్లో చెప్పే వారు ఎందరో. దీంతో మీడియాలో వైసీపీలో అసంతృప్తి సెగలు అన్న వార్త రావటంతో అధిష్టానం అందరితో వివరణలు ఇప్పించే ప్రయత్నం చేసింది. ఈ వివరణలతో ఒక సమస్య పోయి మరో సమస్య తెరపైకి వచ్చినట్లు అయిందని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ వ్యవ్యహారంపై సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా స్పందించారు. అధికారుల అలసత్వాన్ని ఎత్తిచూపితే అది అసంతృప్తా? అని ఆయన ప్రశ్నించారు.

మరో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి కూడా తాను అధికారుల తీరును తప్పుపట్టాను తప్ప..అధిష్టానంపై తనకెందుకు అసంతృప్తి ఉంటుందని ప్రశ్నించారు. ఇలా ఎమ్మెల్యేలు అందరూ ‘అసంతృప్తి’కి సంబంధించి వివరణలు ఇచ్చి నెపాన్ని అధికారులపైకి తోసేశారు. మరి ఇంత మంది సీనియర్లు అధికారుల వైఖరిని తప్పుపడితే అది ప్రభుత్వ వైఫల్యం కిందకు రాదా?. అంటే ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు చెబుతున్న పనులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయా?. లేక నిబంధనల ప్రకారం ఉన్నా కూడా అధికారులు చేయటం లేదా?. అన్న ప్రశ్నలు ఉదయించటం సహజం. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అయితే సీఎం లేఖనే పట్టించుకోవటం లేదంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఇసుక కొరత అయితే పలు జిల్లాల్లో ఉంది. దీనిపై చాలా మంది ఎమ్మెల్యేలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.

అసలు ఎలాంటి లోపాలు లేకుండా కొత్త విధానం తీసుకొస్తామని చెప్పిన వైసీపీ సర్కారు ఈ విషయంలో సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొంటోంది. సాక్ష్యాత్తూ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అయితే బహిరంగంగా పలుమార్లు అధికారుల తీరుపై అసంతృప్తి..ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాజాగా మరోసారి ఇదే వైఖరితో ఉంటే తిప్పలు తప్పవని ఓ శాఖ అధికారులను హెచ్చరించారు. తాజా పరిణామాలు అన్నీ చూస్తుంటే అసంతృప్తి లేదని అందరితో చెప్పించే ప్రయత్నంలో ప్రభుత్వ అధికారుల వైఫల్యం అంటే అది ప్రభుత్వ వైఫల్యం కిందకే వస్తుందని విషయాన్ని పార్టీ అధిష్టానం మర్చిపోయినట్లు ఉందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it