Telugu Gateway
Andhra Pradesh

ఓ వైపు క్వారంటైన్ కండిషన్లు..మరో వైపు టీటీడీ దర్శనాలు!

ఓ వైపు క్వారంటైన్ కండిషన్లు..మరో వైపు టీటీడీ దర్శనాలు!
X

కోట్లాది మంది భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులకు అనుమతి లభించింది. టీటీడీ దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 11 నుంచి సామాన్య భక్తులతోపాటు వీఐపీలకు దర్శనాలు కల్పించబోతున్నట్లు ..రోజుకు ఏడు వేల మందికే అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ వై వీ సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా భయం ఉన్న సమయంలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించటం సరైన నిర్ణయమే. అయితే ఏపీలోకి ఎవరు ప్రవేశించాలన్నా కూడా ఇప్పుడు క్వారంటైన్ నిబంధన పాటించాల్సిందే అని సర్కారు ప్రకటించింది. ఇప్పటివరకు అయితే ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి క్వారంటైన్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. తెలంగాణలో ఎక్కడ నుంచి తిరుమల వెళ్లాలన్నా కూడా క్వారంటైన్ నిబంధన వర్తిస్తుంది. మరి ఈ సమయంలో భక్తులకు దర్శనాలు అనుమతి అని ప్రకటించటంతో గందరగోళం తలెత్తే అవకాశం ఉంది. ఇదే అంశంపై ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ ఆన్ లైన్ లో టీటీడీ టిక్కెట్ కొనుగోలు చేయటంతో ఏపీలోకి ప్రవేశించే అనుమతి లభించినట్లు కాదని తెలిపారు.

ఏపీలోకి ప్రవేశించేందుకు ఏ నిబంధనలు అయితే ఉన్నాయో ఆ నిబంధనలు కూడా పాటించాల్సిందే అని తెలిపారు. అంటే ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల వారు కనీసం ఏడు రోజులు సంస్థాగత క్వారంటైన్ లో ఉండాలి..తర్వాత హోం క్వారంటైన్ లో ఉండాలనే నిబంధన ఉంది. ఈ లెక్కన ఇతర రాష్ట్రాల వారు తిరుమల దర్శనానికి వెళ్ళాలంటే క్వారంటైన్ చిక్కులు తప్పనిసరి. టీటీడీ అయినా తొలుత ఏపీలోని భక్తులకే వెసులుబాటు ఉంటుందని..తర్వాత ఎవరైనా రావొచ్చని చెప్పి ఉంటే బాగుండేదని..అలా కాకుండా ఓ వైపు క్వారంటైన్ నిబంధనలు పెట్టి ఎవరైనా రావొచ్చని చెప్పటం వల్ల భక్తులు గందరగోళానికి గురికావటంతో అనవసరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉందని ఆ అధికారి వ్యాఖ్యనించారు. లేదంటే తిరుమల దర్శనాలకు వచ్చేవారికి క్వారంటైన్ ఉండదు అని చెప్పినా సముచితంగా ఉండేదని..అలా కాకుండా ఎవరైనా రావొచ్చు అంటూనే..అన్ని నిబందనలు పాటించాలనటంతో భక్తులకు చిక్కులు తప్పవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it