Telugu Gateway
Politics

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్
X

హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ఎదురుగా ఉన్న ప్రస్తుత సచివాలయం ఇక చరిత్ర పుటల్లోకి వెళ్లిపోనుంది. ఎందుకంటే ఈ సచివాలయం కూల్చివేతకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇది త్వరలోనే కనుమరుగు కాబోతోంది. కాకపోతే ఇక్కడే తెలంగాణ సర్కారు అత్యాధునిక హంగులతో కొత్త సచివాలయం నిర్మించాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కెసీఆర్ ఇప్పటికే కొత్త సచివాలయ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. శంకుస్థాపన చేసి కూడా ఏడాది దాటింది. అయినా కూడా హైకోర్టులో కేసు ఉండటంతో పనులు ఏ మాత్రం ముందుకు సాగలేదు. సోమవారం నాడు హైకోర్టు పాత సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని..సర్కారు వాదనవైపే మొగ్గుచూపింది.

ప్రస్తుత సచివాలయంలో చాలా భవనాలు చాలా సంవత్సరాల పాటు పనిచేసేందుకు అనువైన స్థితిలో ఉన్నాయని..అదే సమయంలో చారిత్రక భవనాలు కూడా ఉన్నాయని కొంత మంది పిటీషనర్లు కోర్టుకు నివేదించారు. ఈ అంశంపై దాదాపు పది పిటీషన్లు దాఖలు కాగా..అన్నింటిని హైకోర్టు కొట్టి వేసింది. దీంతో ఇక్కడ కొత్త సచివాలయం రావటానికి మార్గం సుగమం అయింది. ప్రస్తుత సచివాలయంలో ఫైర్ సేఫ్టీ ఏ మాత్రం లేదని..పార్కింగ్ కూడా సరిపోవటంలేదంటూ ప్రభుత్వం హైకోర్టులో వాదనలు విన్పించింది. అదే సమయంలో కొత్త రాష్ట్రంలో సరికొత్త హంగులతో కొత్త సచివాలయం నిర్మించాలనుకున్నట్లు తెలిపింది.

Next Story
Share it