Telugu Gateway
Telangana

తెలంగాణలో వేతనాల కోతపై ఆర్డినెన్స్ జారీ

తెలంగాణలో వేతనాల కోతపై ఆర్డినెన్స్ జారీ
X

రాష్ట్రంలో నెలకొన్న ప్రజారోగ్య అత్యయిక పరిస్థితి దృష్టా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల్లో కోతకు సంబంధించి తెలంగాణ సర్కారు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. జూన్ 16 నుంచి ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చినట్లు అయింది. ముఖ్యంగా పెన్షనర్లకు ఇచ్చే మొత్తంలో కోతకు సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోంది. అందుకే సర్కారు ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. కోర్టులో సమాధానం చెప్పుకోవటానికే సర్కారు ఈ ఆర్డినెన్స్ తెచ్చిందని వీరు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికే మూడు నెలలుగా జీతాల్లో కోత వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని..జూన్ నెలలో అయినా సరే పూర్తి స్థాయి వేతనాలు ఇవ్వాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్ధిక అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప..పెన్షనర్లకు ఇచ్చే డబ్బు ఆపటం సాధ్యంకాదని..అయినా సరే ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలంటూ కేసు విచారణను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

తక్షణమే ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకోవాలి

తెలంగాణలో జీతాల కోత పై ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని తెలంగాణ ప్రాగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల ఉద్యోగ ,ఉపాధ్యాయ,పెన్షనర్లు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నరని ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి పేర్కొన్నారు.ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చివాట్లు పెట్టిన తర్వాత కూడా ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోతుందన్నారు.వెంటనే కోత విధించిన జీతాలను విడుదల చేయాలని అలాగే జూన్ నెలకు పూర్తి వేతనాలు,పెన్షన్లు బేషరతుగా ఇవ్వాలని తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story
Share it