Telugu Gateway
Telangana

సంతోష్ బాబు కుటుంబానికి ఐదు కోట్లు

సంతోష్ బాబు కుటుంబానికి ఐదు కోట్లు
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కీలక ప్రకటన చేశారు. భారత్-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి ఐదు కోట్ల రూపాయల నగదు, ఇంటి స్థలం, ఆయన భార్యకు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో ఈ ఘర్షణలోమరణించిన ఇతర రాష్ట్రాలకు చెందిన పందొమ్మిది మందికి కూడా పది లక్షల రూపాయల లెక్కన అందించనున్నారు. ఈ మొత్తాన్ని కూడా కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందజేస్తామన్నారు. సంతోష్ బాబు కుటుంబానికి తానే వ్యక్తిగతం వెళ్లి కలసి ఈ మొత్తాన్ని అందజేస్తానన్నారు. ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం నాడు నిర్వహించిన అఖిలపక్ష సమావేశం సందర్భంగా కెసీఆర్ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కెసీఆర్ కేంద్రానికి పలు సూచనలు చేశారు. భారత-చైనా సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఏమాత్రం తొందరపాటు ఉండొద్దని, అదే సందర్భంలో దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలని ప్రధానమంత్రికి సూచించారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పుడు కావల్సింది రాజకీయం (రాజ్ నీతి) కాదని, యుద్ధనీతి (రణ్ నీతి) కావాలని చెప్పారు.

భారతదేశంలో పరిపాలన సుస్థిరంగా ఉండడంతో పాటు, గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడం ఓర్వలేకనే చైనా కయ్యానికి కాలుదువ్వుతున్నదని సిఎం అభిప్రాయపడ్డారు. ‘‘చైనా, పాకిస్తాన్ దేశాలకు తమ దేశాల్లో అంతర్గత సమస్యలున్నప్పుడు సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం సృష్టించడం అలవాటు. ఇప్పుడు చైనాలో కూడా అంతర్గత సమస్యలున్నాయి. దక్షిణ చైనా సముద్ర తీర దేశాలైన మలేషియా, ఫిలిప్పీన్స్, జపాన్ తదితర దేశాలతో కూడా చైనా ఘర్షణలకు దిగుతున్నది. చైనా వైఖరి ప్రపంచ వ్యాప్తంగా బాగా అపఖ్యాతి(బద్నాం) పాలయింది’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘‘భారతదేశంతో చైనా మొదటి నుంచి ఘర్షణ వైఖరి అవలంభిస్తున్నది. చైనాతో భారతదేశానికి ఎప్పటికైనా ప్రమాదం పొంచి వుంది. కాబట్టి మనం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంది’’ అని ముఖ్యమంత్రి సూచించారు. ‘‘చైనా ఇటీవల కాలంలో భారతదేశంతో ఘర్షణాత్మక వైఖరి అవలంభిస్తున్నది. దానికి ప్రత్యేక కారణాలున్నాయి. కాశ్మీర్ విషయంలో కొత్త చట్టాలు తెచ్చాం. అక్కడి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నాం. పివోకె గురించి గట్టిగా మాట్లాడుతున్నాం.

ఆక్సాయ్ చిన్ మనదే అని, అది చైనా ఆక్రమించిందని పార్లమంటులోనే మన కేంద్ర మంత్రి ప్రకటించారు. గాల్వన్ లోయ దేశ రక్షణ విషయంలో స్ట్రాటజిక్ పాయింట్. అక్కడ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాం. ఇది చైనాకు నచ్చడం లేదు. అందుకే ఘర్షణాత్మక వైఖరి అవలంభిస్తున్నది’’ అని సిఎం చెప్పారు. దేశమంతా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి అండగా నిలవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు ఈ సమయంలో దేశ ప్రధానికి అండగా ఉంటారు’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. ‘‘చైనా నుంచి వస్తువుల దిగుబడి ఆపాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది తొందరపాటు చర్య అవుతుంది. ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న వస్తువులు మన దేశంలోనే తయారు కావాలి. ప్రజలకు సరసమైన ధరల్లో వస్తువులు దొరకాలి. ముందుగా మనం ఈ విషయాలపై దృష్టి పెట్టాలి’’ అని కేసీఆర్ సూచించారు. ‘‘భారత్ తో చైనా ఘర్షణాత్మక వైఖరి కొనసాగిస్తున్న నేపథ్యంలో దాన్ని ఎదుర్కోవడానికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు రూపొందించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు వద్దు. అదే సమయంలో ఎవరికీ తలవంచొద్దు. ’ అని కెసీఆర్ సూచించారు.

Next Story
Share it