Telugu Gateway
Telangana

పీసీసీ పదవి కోసమే రేవంత్ రెడ్డి విమర్శలు

పీసీసీ పదవి కోసమే రేవంత్ రెడ్డి విమర్శలు
X

తెలంగాణ పురపాలక, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ ఫాంహౌస్ వ్యవహారంపై కాంగ్రెస్ విమర్శలపై టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఎటాక్ ప్రారంభించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు మీడియా సమావేశం పెట్టి ఎంపీ, కాంగ్రెస్ వర్కంగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, సైదిరెడ్డి, ఆ పార్టీ నేత కర్నె ప్రభాకర్ లు మీడియా ముందుకొచ్చారు. ‘111 జీవో పరిధిలోని వట్టి నాగులపల్లి లో రేవంత్ బాగోతం బయట పెడుతున్నా. సర్వే నెంబర్ 66/ఈ లో రేవంత్ రెడ్డి బావమరిది జయప్రకాష్ రెడ్డి అక్రమ కట్టడాలు కడుతున్నారు . రేవంత్ రెడ్డి దీనిపై సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ నాయకులు ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు . ఎవరెవరికి 111 జీవో పరిధిలో భూములున్నాయో బయట పెడతాం. రేవంత్ చూపెట్టిన భూములు కేటీఆర్ వి కావు. కెటీఆర్ ఎదుగుదలను జీర్ణించుకోలేక మాట్లాడుతున్నారు. రేవంత్ వ్యవహారాలు ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. వట్టి నాగులపల్లి లో నీ పేరు..మీ బంధువుల పేర్ల మీద ఉన్న భూముల పై ముందు సమాధానం చెప్పు’ అని బాల్క సుమన్ డిమాండ్ చేశారు.

కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ ‘సంచలనాలు కోసమే రేవంత్ మాట్లాడతారు . రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరం.జాతీయ పార్టీ కి ఇలాంటి నాయకుడి అవసరం ఉందా..? ఆలోచించండి . టీఆర్ ఎస్ నాయకులం ధర్మానికి కట్టుబడి ఉన్నాం. కోర్టులంటే మాకు గౌరవం ఉంది . ప్రజలంతా ఒకవైపు ఉంటే... రేవంత్ టీం అంతా ఓవైపు . రేవంత్ వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవడం మానుకోవాలి . కెటీఆర్ ఫార్మ్ హౌస్ విషయాలు చాలా సార్లు చెప్పారు . 111 పరిధిలో మా పార్టీ నాయకుల ఫార్మ్ హౌస్ లు ఉన్నాయని విహెచ్ చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలి . చిల్లర ప్రయత్నం మానుకోవాలి . 111 జీవో లో పెద్ద బంగ్లా కట్టుకుంది నువ్వు . దొంగనే దొంగ అన్నట్టుంది రేవంత్ వ్యవహారం . రేవంత్ మాటలు ఎవరూ పట్టించుకోరు’ అని వ్యాఖ్యానించారు. పీసీసీ పదవి కోసమే రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే సైదిరెడ్డి విమర్శించారు.

Next Story
Share it