జూన్ 9న జగన్ తో టాలీవుడ్ టీమ్ భేటీ
టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు ఈ నెల 9న అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం కానున్నారు. ఈ భేటీలో చిరంజీవితోపాటు నాగార్జున, నిర్మాత సి. కళ్యాణ్ తదితరులు ఉండబోతున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమ కోసం సింగిల్ విండో అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోపాటు కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్ లకు అనుమతులు ఇచ్చే అంశంపై పరిశ్రమ ప్రముఖులు సీఎం జగన్ తో భేటీ సందర్భంగా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇదే అంశంపై తెలంగాణ సీఎం కెసీఆర్ ను కూడా కలిసి అనుమతి కోరిన విషయం తెలిసిందే.
తెలంగాణ సీఎం కెసీఆర్ తో భేటీకి తనను ఎవరూ ఆహ్వానించలేదని హీరో బాలకృష్ణ వ్యాఖ్యానించటం పెద్ద దుమారం రేపింది. అయితే జగన్ తో భేటీ విషయంలో ముందు జాగ్రత్తగా నిర్మాత సి.కళ్యాణ్ ఫోన్ చేసి బాలకృష్ణకు ఈ భేటీ సమాచారం తెలియజేయటంతోపాటు ఈ భేటీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే పుట్టిన రోజు వేడుకల బిజీలో ఉండటం వల్ల తాను రాలేకపోవచ్చని బాలకృష్ణ తెలిపారని కళ్యాణ్ వెల్లడించారు. అందుబాటులో ఉన్న తాము అంతా సీఎం జగన్ తో భేటీ కానున్నట్లు కళ్యాణ్ తెలిపారు.