Telugu Gateway
Cinema

షూటింగ్ కే అర్హత లేని హీరోలకు అంత ఆరాటం ఎందుకో?

షూటింగ్ కే అర్హత లేని హీరోలకు అంత ఆరాటం ఎందుకో?
X

కోవిడ్ 19 నిబంధనల ప్రకారం చూస్తే హీరో చిరంజీవి, నాగార్జునలు ప్రస్తుతం షూటింగ్ లో పాల్గొనే అర్హత కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ సర్కారు ఇచ్చిన జీవో, ప్రామాణిక నిర్వహణ విధానాలు (ఎస్ వోపీ)లో పది సంవత్సరాల లోపు, అరవై ఏళ్ళు పైబడిన వారిని షూటింగ్ కు దూరంగా పెట్టడం మంచిదని స్పష్టం చేసింది. లేదు..వీళ్లు షూటింగ్ లో పాల్గొనాలంటే మెడికల్ క్లియరెన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుందని సర్కారు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎందుకంటే ఈ వయస్సుల వారికి హాని ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అందుకే కోవిడ్ 19 నిబంధనల్లో ప్రతి చోటా ఈ అంశం ఉంటుంది. అయితే చిరంజీవి, నాగార్జున విషయాలకు వస్తే వాళ్లు భౌతికంగా ఫిట్ గా..పర్పెక్ట్ గా ఉన్నా కూడా రిస్క్ శాతం ఎక్కువ. షూటింగ్ లో పాల్గొనే వారిలో ఎవరికి కోవిడ్ 19 లక్షణాలు ఉన్నా ఈ వయస్సుల వారు దాని ప్రభావానికి తేలిగ్గా గురవుతారు. చిరంజీవి వయస్సు 64 సంవత్సరాలు. నాగార్జున వయస్సు 60 సంవత్సరాలు.

పరిశ్రమకు చెందిన యువ హీరోలు మాత్రం షూటింగ్ ల గురించి మాట్లాడకుండా తమ పని తాము చేసుకుంటున్నారు. యువ హీరోలు చాలా మంది ఆగస్టు వరకూ షూటింగ్ ల్లో పాల్గొనేది లేదని తేల్చిచెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కానీ చిరంజీవి, నాగార్జున అండ్ టీమ్ మాత్రం షూటింగ్ ల కోసం ఎక్కడ లేని హడావుడి చేస్తోంది. తెలంగాణ సర్కారు ఇఛ్చిన కోవిడ్ 19 మార్గదర్శకాల ప్రకారం చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణలు షూటింగ్ లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అయితే వెంకటేష్ కూడా తాను ఇఫ్పట్లో షూటింగ్ లకు రానని..ఇంత హడావుడిగా షూటింగ్ చేస్తే అసలు థియేటర్లు ఎప్పుడు ప్రారంభం అవుతాయి..ప్రేక్షకులు ఎప్పుడు వస్తారనే క్లారిటీ ఉందా? అని ప్రశ్నించినట్లు చెబుతున్నారు. బాలకృష్ణ అయితే బహిరంగంగానే షూటింగ్ లకు అంత తొందరేమి ఉందని ప్రశ్నించారు.

ఇంకో అంశం ఏమిటంటే ఇటు తెలంగాణ సీఎం కెసీఆర్, అటు ఆంధ్రా సీఎం జగన్ తో భేటీ సమయంలో ఎంతసేపూ తమ ప్రయోజనాలు..తమ అవసరాల కోసం గురించి మాట్లాడారే కానీ..పరిశ్రమలో పనిచేసే వేలాది కార్మికులకు సంబంధించి ప్రభుత్వపరంగా సాయం అందించే విషయంతోపాటు..వారికి ఇళ్ళ స్థలాలు వంటి వాటిపై ఈ ప్రముఖులుగా చెప్పబడుతున్న వారెవరూ ప్రస్తావించలేదని చెబుతున్నారు. కానీ వాళ్ళు మాత్రం వైజాగ్ లో సినిమా స్టూడియోలు, ఇళ్ళ స్థలాల ఆఫర్ అందుకుని వచ్చారు. తెలంగాణలో కూడా రాచకొండ వైపు టాలీవుడ్ కోసం తెలంగాణ సర్కారు భూమి కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పరిశ్రమ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. పరిశ్రమ పెద్ద మనుషులుగా హడావుడి చేస్తున్న వారు అంతా తమ సొంత ప్రాపకం కోసం..సొంత అవసరాల కోసం పరిశ్రమ ముసుగులో హంగామా చేస్తున్నారని..అందుకనే ఎన్నికైన ‘మా’ ను కూడా పక్కన పెట్టి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ వ్యవహారంపై టాలీవుడ్ లో ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది.

Next Story
Share it