Telugu Gateway
Telangana

కరోనా పరీక్షల సంఖ్య పెంచాలి

కరోనా పరీక్షల సంఖ్య పెంచాలి
X

తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె సోమవారం నాడు నిమ్స్ ఆస్పత్రిని సందర్శించి కరోనా బారిన పడిన వైద్యులు, సిబ్బందిని పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో మరిన్ని మార్పులు అవసరం అని ఆమె వ్యాఖ్యానించారు. కరోనా పరీక్షలు ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం చేస్తున్నా ఈ సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. తన పర్యటన ఉద్దేశం తామంతా ప్రజలతో ఉన్నామని చెప్పటానికే అన్నారు.

ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వారియర్స్.దేశం కోసం పోరాడుతున్న వారు. డాక్టర్లు, స్టాఫ్ నర్సులకు నైతిక మద్దతు ఇచ్చేందుకే వచ్చానన్నారు. మెడికోలకు కరోనా వైరస్ సోకటం బాధాకరం. నేను మీతో ఉన్నాను అని చెప్పేందుకు వచ్చాను. తెలంగాణ ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నా. సురక్షితంగా ఉండండి అన్నారు. లాక్ డౌన్ లో మినహాయింపులు ఇచ్చినా అది ప్రజలకే అని..వైరస్ కు కాదన్నారు. మీడియా సిబ్బంది కూడా జాగ్రత్తలు తీసుకోవాలని..మనోజ్ మరణాన్ని కూడా గవర్నర్ ప్రస్తావించారు. తెలంగాణలో కరోనా టెస్ట్ లు అతి తక్కువగా చేస్తున్నారని విమర్శలు వస్తున్న తరుణంలో గవర్నర్ టెస్ట్ ల సంఖ్య పెంచాలని కోరటం విశేషం.

Next Story
Share it