Telugu Gateway
Politics

ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులోనూ షాక్

ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులోనూ షాక్
X

సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయటాన్ని సుప్రీం తప్పుపట్టింది. ఈ విషయంలో హైకోర్టు తీర్పును సమర్ధించింది. నాలుగు వారాల్లో ఈ రంగులను తొలగించాలని..లేదంటే కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఇలా సుప్రీంకోర్టులో రంగుల విషయంలో ఎదురుదెబ్బ తగలటం ఇది రెండవ సారి. గతంలో ఓ సారి హైకోర్టు తీర్పుపై అప్పీల్ చేయగా..సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయటం ఏ మాత్రం సరికాదని..ఢిల్లీలో బిజెపి గెలించింది కాబట్టి పార్లమెంట్, ఇతర భవనాలను కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా? అని ప్రశ్నించింది.

అయినా సరే ఏపీలోని సర్కారు వైసీపీ మూడు రంగులకు తోడు...మరో కొత్త రంగును జత చేసి హైకోర్టు ఆదేశాలను అమలు చేసినట్లు పేర్కొంది. దీనిపై మరోసారి కేసు నమోదు కాగా..ఏపీ హైకోర్టు ఏకంగా సీఎస్ నీలం సాహ్నితోపాటు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేదిపై కోర్టు ధిక్కారం నమోదు చేయాల్సిందిగా ఆదేశింది. దీనిపై కూడా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఇప్పుడు అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఉన్న రంగులకు నాలుగో రంగు జత చేయటాన్ని సుప్రీం కూడా తప్పుపట్టింది. దీంతో ఏపీ సర్కారుకు ఈ రంగులు తొలగించటం మినహా మరో మార్గం లేకుండా పోయింది.

Next Story
Share it