Telugu Gateway
Politics

టిమ్స్ లో ఉన్నది చెత్త..సెక్యూరిటీ..ఓ కుక్కే

టిమ్స్ లో ఉన్నది చెత్త..సెక్యూరిటీ..ఓ కుక్కే
X

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్ర‌త్యేక కోవిడ్ ఆసుప‌త్రిగా ప్రారంభించిన టిమ్స్ ఆసుప‌త్రిలో చెత్త‌, న‌లుగురు సెక్యూరిటీ, ఓ కుక్క త‌ప్పా ఎవ‌రూ లేర‌ని అన్నారు. సీఎం కెసీఆర్ చెప్పిన 100మంది డాక్ట‌ర్లు, ప్ర‌పంచ అత్యాధునిక వైద్యం ఎక్కడుంద‌ని ఎంపీ రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. సీఎం కేసీఆర్ మాట‌ల‌కు, చేత‌ల‌కు పొంత‌న లేద‌న‌టానికి టిమ్స్ ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ అని... చెత్త‌తో టిమ్స్ నిండిపోయింద‌ని రేవంత్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఆదివారం నాడు గ‌చ్చిబౌలి టిమ్స్ ఆసుప‌త్రిని సంద‌ర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 50వేల టెస్టులు కూడా చేయ‌లేదని విమ‌ర్శించారు. ఏపీలో 5.50ల‌క్ష‌ల టెస్టులు చేశార‌ని... దేశంలో అత్య‌ధిక‌ టెస్టులు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ‌లో 22వ స్థానంలో ఉంద‌న్నారు. మ‌ర‌ణాల రేటులో దేశంలోనే తెలంగాణ ముందుంద‌ని విమ‌ర్శించారు. ఉద్యోగుల‌కు జీతాలివ్వ‌కుండా తీసుకున్న తీసుకున్న నిధులు, కేంద్రం ఇచ్చిన నిధులు, వివిధ వ‌ర్గాల నుండి వ‌చ్చిన విరాళాలు ఏం చేశార‌ని రేవంత్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు.

వైద్య‌శాఖ మంత్రిని పొలాల్లో దిష్టిబొమ్మ‌గా, మీ తొలుబొమ్మ‌గా చేశార‌ని ఆరోపించారు. మీరు య‌జ్ఙాలు చేస్తే రెండు, మూడు రోజులు అక్క‌డే ఉండి ప‌నిచేసే మంత్రుల‌కు ఇక్క‌డ ప‌నిచేయించండ‌ని, అధికారుల‌ను పంపించి ఆసుప‌త్రిని వాడుకోవాల‌ని సూచించారు. దేశానికే త‌ల‌మానికంగా చెప్పుకున్న టిమ్స్ లో మురుగు నీరు వ్య‌వ‌స్థ కూడా లేద‌ని, ప‌క్క‌నున్న సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీలోకి వ‌దిలేస్తే వారు ఆందోళ‌న చేస్తున్న అంశాన్ని గ‌మ‌నించి తాను 50 ల‌క్ష‌లు మంజూరు చేసినా ప‌నులు మొద‌లుపెట్ట‌లేద‌ని విమ‌ర్శించారు. క‌రోనా క‌ట్ట‌డిలో ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌లం అయ్యింద‌ని, ఎలాంటి ప్ర‌ణాళిక లేకుండా ప‌నిచేస్తుంద‌న్నారు. ప్ర‌తి రోజు భ‌య‌ట‌కు చెప్ప‌కుండా 40,50మ‌ర‌ణాల‌ను దాస్తున్నార‌ని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం, కేసీఆర్ మొద్దు నిద్ర వీడి... గాంధీ ఆసుప‌త్రిపై ఒత్తిడి త‌గ్గించాల‌ని డిమాండ్ చేశారు. వెంట‌నే టిమ్స్ ప్రారంభం అయ్యేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు.

Next Story
Share it