Telugu Gateway
Politics

ఆ భూమి కెటీఆర్ దే..ఇవిగో ఆధారాలు

ఆ భూమి కెటీఆర్ దే..ఇవిగో ఆధారాలు
X

నాది కాదంటూ కెటీఆర్ పచ్చి అబద్ధాలు

డాక్యుమెంట్లు బహిర్గతం కేసిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి

తెలంగాణ పురపాలక, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ కు చెందిన ఫాం హౌస్ వ్యవహారం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఎన్జీటీ జారీ చేసిన నోటీసులపై స్పందిస్తూ మంత్రి కెటీఆర్ తనకు భూములు లేవని గతంలోనే చెప్పానని..కొంత మంది కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ట్వీట్ చేశారు. దీనిపై ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. కెటీఆర్ లక్ష అడుగుల విస్తీర్ణంలో నిర్మించుకున్న విలాసవంతమైన ఫాంహౌస్ భూమి ఆయన భార్య పేరు మీద, కెటీఆర్ కు చెందిన ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ పేరు మీద ఉందని డాక్యుమెంట్లను మీడియాకు విడుదల చేశారు. అడ్డంగా దొరికిపోయి కూడా కెటీఆర్ ఇంకా అబద్ధాలు చెబుతూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ అధికార ప్రతినిధి బాల్క సుమన్ కూడా జన్వాడలోని ఫాంహౌస్ ఎవరిది అని అడిగితే కెటీఆర్ దే అని చెబుతారని..మీడియా సమావేశం సాక్షిగా చెప్పారని..అందుకు ఇదిగో ఆధారం అంటూ నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన వార్తను చూపించారు. దీంతో పాటు రేవంత్ రెడ్డి తన అనుచరులతో డ్రోన్ కెమెరాలు ఉపయోగించి ఫాంహౌస్ చిత్రీకరించారని దాఖలైన కేసు సమయంలో తనకు బెయిల్ నిరాకరించేందుకు పోలీసులు కోర్టు ముందుకు దాఖలు చేసిన పిటీషన్ లో నూ ఆ ఫాంహౌస్ కెటీఆర్ దే అని స్పష్టంగా తెలిపారన్నారు.

కుటుంబ సభ్యులతోపాటు ఎవరిపై అవినీతి ఆరోపణలు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటానన్న సీఎం కెసీఆర్ ఎందుకు తన తనయుడి విషయంలో మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. దళిత నాయకుడు రాజయ్యకు ఓ రూల్..కెటీఆర్ కు ఓ రూలా? అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. అసలు విషయానికి సమాధానం చెప్పకుండా మంత్రి కేటీఆర్‌ తనపై మిడతలదండు, బ్రోకర్లు, జోకర్లను ఉసిగొల్పుతున్నారంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కెటీఆర్ తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ‘‘మీకు సవాల్ చేస్తున్నాను... అర్ధరాత్రి ఫోన్ చేసినా వస్తాను. నేరుగా వట్టినాగులపల్లిలోని మా భూముల దగ్గరకు వెళదాం.. వట్టినాగులపల్లిలో నా భూమిలో పూచికపుల్ల ఉన్నా... అక్కడే జేసీబీలతో నేలమట్టం చేద్దాం. ఆ పని కూడా నేనే చేస్తా. అక్కడి నుంచి నేరుగా జన్వాడ వెళదాం.. అక్కడ ఫామ్‌హౌజ్ విషయాన్ని తేలుద్దాం’’ అన్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్న తమకు పారదర్శకంగా ఉండాల్సిన బాధ్యత ఉందని, ఫామ్‌హౌజ్‌పై ప్రజలకు వివరణ ఇవ్వాల్సిందేనన్నారు. తనకు భూములు లేవంటూ కెటీఆర్ చేసిన ట్వీట్ కు మద్దతుగా నిలిచిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పైనా రేవంత్ పేరు పెట్టకుండా తీవ్ర విమర్శలు చేశారు.కెటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా ఉండటంతో ఆయన శాఖలో పనిచేసే అధికారులు ఎన్జీటీకి నిష్పాక్షిక నివేదిక ఇవ్వరని..అందుకే రెండు నెలల పాటు అయినా మంత్రి కెటీఆర్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నోసార్లు పదవులు త్యాగం చేశామని చెప్పుకునే కెటీఆర్ రెండు నెలలు మంత్రి పదవి లేకుండా ఉండలేరా? అని ప్రశ్నించారు.

Next Story
Share it