Telugu Gateway
Politics

అట్లుంది కెసీఆర్ ఎవ్వారం

అట్లుంది కెసీఆర్ ఎవ్వారం
X

కొండపోచమ్మసాగర్ కాలువకు గండపడిన వ్యవహారంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ అంశంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ‘పనిమంతుడు పందిరేస్తే పిట్టొచ్చి వాలితే.. పుటుక్కున కూలిందట.... అట్లుంది కేసీఆర్ ఎవ్వారం. కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి కేసీఆర్ ఫాంహౌస్ కు నిర్మించుకున్న కెనాల్ కు గండిపడి ‘శివారు వెంకటాపురం’ నిండా మునిగింది. అవినీతి కట్టలు తెగి పొంగిపొర్లుతోంది. ఇది కూడా ‘మెగా మేత’ ఘనతే! ఈ కెనాల్ ను ‘జాతిజలగ’ ప్రారంభించి వారమే అయింది!’ అంటూ వ్యాఖ్యానించారు. కొండపోచమ్మ కథలు రెండు అంటూ ఈ అంశంపై రేవంత్ విమర్శలు చేశారు. ‘కొండపోచమ్మ సాగర్, కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలు రోజుకోకటి బయట పడుతున్నాయి. ఈ రోజు కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి కేసీఆర్ ఫాం హౌస్ కు పోయే కాలువకే పెద్ద గండి పడింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి నెల కూడా కాలేదు రెండు ప్రధాన కాలువలు గండ్లు పడ్డాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజక వర్గంలోనే , కేసీఆర్ ఫార్మ్ హౌస్ కు పోయే కాలువ పనుల్లోనే నాణ్యత ఇంత ఘోరంగా ఉంటే ఇక రాష్ట్రంలో జరిగిన కాలువలు, జలాశయాల నాణ్యత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

చిన్న కాలువల పరిస్థితి ఇలా ఉంటే ఇక సర్పేస్ లో నిర్మించిన 50 టి ఎమ్ సి ల మల్లన్న సాగర్, 15 టీఎంసీ ల కొండపోచమ్మ సాగర్, గందమల్ల ల పరిస్థితి ఎలా ఉండబోతోందో ఆలోచిస్తే భయం వేస్తోంది. ఆ జలాశయాలకు ఇలాగే గండిపడితే ఒక్క ఊరు మిగలదు. వాటి పరిధిలో ఉన్న అన్ని గ్రామాలు జలవిలయంలో కొట్టుకుపోతాయి. కేసీఆర్, మేఘ కంపెనీ కమీషన్ల కక్కుర్తికి ఈ నాణ్యత లోపలే పరాకాష్ట. లక్ష కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టు లో పెద్దఎత్తున అవినీతి జరిగింది. అవినీతి సొమ్ముతో కేసీఆర్ రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారు కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీబీఐ చేత ఈ పనులపై విచారణ జరిపి అక్రమాలకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోవాలి.’ అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story
Share it