Telugu Gateway
Andhra Pradesh

టీడీపీ తరహాలోనే వైసీపీ కూడా హ్యాండ్సప్

టీడీపీ తరహాలోనే వైసీపీ కూడా హ్యాండ్సప్
X

ప్రత్యేక హోదా లేదు..రామాయపట్నం పోర్టుకు నిదులూ లేవు

అప్పులు చేసి రామాయపట్నం పోర్టు కడతామంటూ జీవో జారీ

‘ల్యాండ్ లార్డ్ మోడల్’ లో అభివృద్ధికి ఆదేశాలు

రాష్ట్ర ప్రభుత్వమే తాము సొంతంగా ఓడరేవును అభివృద్ధి చేసుకుంటామంటూ ఏకంగా ఉత్తర్వులు జారీ చేశాక..కేంద్రం అసలు ఆ ప్రతిపాదనను పరిశీలిస్తుందా?. పోనీ కేంద్రం నుంచి పోర్టు నిర్మాణానికి అవసరమైన ఆర్ధిక సాయానికి లిఖితపూర్వక హామీ ఏమైనా పొందారా అంటే అదీ లేదు. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలు అన్నీ సాధిస్తామని ఊదరగొట్టిన వైసీపీ ఇఫ్పుడు మాత్రం రివర్స్ గేర్ లో వెళుతోంది. ప్రత్యేక హోదాను ఎలాగూ అటకెక్కించారు. కనీసం ఓ నాన్ మేజర్ పోర్టుకు సంబంధించి కూడా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోలేని పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందా అంటే ఔననే సమాధానం వస్తోంది. అది ఏదో కేంద్రం చేసే మేలు (ఫేవర్) కూడా కాదు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన హక్కే. 2019 డిసెంబర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రబాబు తలపెట్టినట్లు నాన్ మేజర్ పోర్టు కాకుండా మేజర్ పోర్టును కేంద్రం నిధులతో చేపడతామని..అందుకే కేంద్రం సాయాలని కోరారు.

విభజన చట్టంలో ఉన్న ఈ విషయం ఐదేళ్లు అయినా కూడా అమల్లోకి రాలేదని పేర్కొన్నారు. ఇలా ఎన్ని వినతులు చేసినా కేంద్రం నుంచి స్పందన శూన్యమనే చెప్పాలి. ఇఫ్పుడు సర్కారు మాత్రం మళ్ళీ చంద్రబాబు బాటలోనే నాన్ మేజర్ పోర్టు నిర్మాణానికి సై అంది. అంటే విభజన చట్టంలో ఉన్న మరో కీలక హామీని తమంతట తాము వదులుకున్నట్లు అవుతుందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ ఓడరేవు నిర్మాణానికి సంబంధించి రైట్స్ సంస్థ ఇచ్చిన సమగ్ర ప్రాజెక్ట నివేదిక (డీపీఆర్) కు అనుగుణంగా రామాయపట్నంలో ‘లాండ్ లార్డ్ ’మోడల్ లో కొత్త పోర్టును అభివృద్ధి చేయనున్నారు. (ల్యాండ్ లార్డ్ మోడల్ అంటే ప్రైవేట్ రిఫైనరీలు..పరిశ్రమలు, ఇతర సంస్థలకు పోర్టు బెర్త్ లను అద్దెకిచ్చి వారి నుంచి డబ్బు వసూలు చేసే విధానం) దీని కోసం రామాయపట్నం పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్ పీడీసీఎల్)ను ఏర్పాటుచేశారు. ఇది ఏపీ మ్యారిటైమ్ బోర్డు పరిధిలో పనిచేస్తుంది.

తొలి దశలో రామాయపట్నం ఓడరేవు పనుల అంచనా వ్యయాన్ని 3736.14 కోట్ల రూపాయలుగా జీవోలో పేర్కొన్నారు. తొలి దశను 36 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నారు. తొలి దశ ప్రాజెక్టు కు అవసరమైన 802 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ఓ వంద కోట్ల రూపాయల మేర సాయం అందించనుంది. అదే సమయంలో ప్రభుత్వం 2079 కోట్ల రూపాయలు అప్పుతెచ్చుకునేందుకు వీలుగా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు మౌలికసదుపాయాలు పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ జీవో2 జారీ చేశారు. ఈ లెక్కన ఎవరికి ఎంత మెజారిటీ ఇఛ్చినా ఏపీకి రావాల్సిన చట్ట బద్దమైన హక్కులను సాధించటంలో అటు టీడీపీ తరహాలోనే ఇప్పుడు వైసీపీ కూడా విఫలమవుతోందనే విషయం స్పష్టం అవుతోంది.

Next Story
Share it