Telugu Gateway
Cinema

రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్

రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్
X

సెలబ్రిటీలపై మీడియాలో వచ్చే వార్తలు అన్నీ ఇన్నీ కావు. కాకపోతే ఈ మధ్యకాలంలో వచ్చే ఫేక్ న్యూస్ లతో సెలబ్రిటీలు చాలా చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు వాటికి వివరణలు ఇఛ్చుకోవటం వారికి పెద్ద తలనొప్పిగా మారుతోంది. తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు అవే చిక్కులు ఎదురయ్యాయి. కొద్ది రోజుల క్రితం లాక్ డౌన్ సడలింపులు ఇచ్చాక రకుల్ ప్రీత్ సింగ్ ఓ మద్యం షాపు నుంచి బాటిల్ కొనుక్కు వెళుతోందని ప్రచారం చేశారు. దీనికి కారణం ఆమె చేతిలో ఓ బాటిల్ ఉండటమే. కాకపోతే వాస్తవానికి ఆమె మెడికల్ షాపు నుంచి ఏవో మెడిసిన్స్ తీసుకెళుతోంది. అందుకే ఈ వార్తలపై స్పందించిన రకుల్ మెడికల్ షాపుల్లో కూడా మందు అమ్ముతున్నారా? అంటూ ప్రశ్నించి వీటికి చెక్ పెట్టారు. ఇప్పుడు ఓ సినిమాకు సంబంధించి మళ్లీ రకుల్ కు చిక్కు వచ్చి పడింది. తమిళ హీరో శివకార్తికేయన్‌, రకుల్‌ జంటగా తమిళంలో ‘అయాలన్‌’ అనే చిత్రం నిర్మాణంలో ఉంది.

ఈ సినిమాకు రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లాక్‌డౌన్‌ కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయింది. అయితే ఇప్పుడు షూటింగ్‌ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో దర్శకనిర్మాతలకు రకుల్‌ షాక్‌ ఇచ్చిందని, కరోనా కారణంగా షూటింగ్‌లలో పాల్గొనని చెప్పడంతో ఆమెను ఈ సినిమా నుంచి తప్పించారనే వార్తలు తమిళ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. ఈ వార్తలపై రకుల్‌ తీవ్రంగా మండిపడ్డారు. 'బాధ్యతాయుతమైన జర్నలిజం మనకు ఎప్పుడు వస్తుంది? వాస్తవాలను చెక్ చేసుకుని రాయడం అన్నది మీడియా ఎప్పుడు ప్రారంభిస్తుంది? నాకూ షూటింగ్ చేయాలనే వుంది. అసలు ఎవరు ఎక్కడ షూటింగులు జరుపుతున్నారో చెప్పండి?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్తలపై చిత్ర దర్శకుడు రవికుమార్‌ కూడా స్పందించారు. రకుల్‌ను తమ సినిమా నుంచి తీసేశారనే వార్త అవాస్తమని తేల్చేశారు.

Next Story
Share it